(దండుగుల శ్రీనివాస్)
కవిత కొత్త పార్టీ ఖాయమే. అది ముందే తెలుసు. ఆమె లేక లీక్ అయి రాజకీయాల్లో చర్చ జరిగినప్పుడే ఆమె కొత్త పార్టీ పెడుతుందని తేలిపోయింది. ఆ రోజు ఎప్పుడా అని ఎదురుచూశారు. ఆ రోజు రానే వచ్చింది. ఈ ఎదురుచూసిన వారిలో.. కవితపై గంపెడాశలు పెట్టకున్నవారిలో ఎక్కువ మంది ఉద్యమకారులే. అవును.. ఇదే ఆశ్చర్యం అందరికీ. ఎందుకంటే కేసీఆర్ ఉద్యమకాలంలో ఒకలా… అధికారం వచ్చిన తరువాత ఫక్తు రాజకీయమే పరమావధిగా మారాడు. ఆ క్రమంలో ఉద్యమకారులు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. కొత్తగా వచ్చి ఎమ్మెల్యే టికెట్లు సంపాదించుకుని.. ఉద్యమకారుల అండతో, పార్టీనే పణంగా పెట్టి బతికిన గులాబీ కార్యకర్తలు, లీడర్ల సాయంతో గెలిచిన ఎమ్మెల్యేలంతా వారిని దూరం పెట్టారు.
వరుసగా వారికే మూడుసార్లు టికెట్లివ్వడంతో కేసీఆర్పై, ఆ పార్టీపై వారికి పూర్తిగా నమ్మకం సడలుతూ వచ్చింది. కానీ ఇతర పార్టీలకు పోలేక.. ఉన్నదాంట్లో మనలేక.. వారి పెత్తనం, అహంకారాన్ని భరించలేక నరకయాతనలు పడ్డారు వారంతా. కవిత .. అన్నతో విభేదించి బయటకు వస్తుందనే వార్త తెలుసుకున్న వీరిలో ఓ ఉత్సాహం వచ్చింది. బీసీ నినాదం ఎత్తుకున్న కవిత, ఉద్యమకారుల గురించి కూడా ఈ మధ్య మాట్లాడటం వారిలో కొత్త ఆశలను చిగురింపజేశాయి. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ నుంచి బయటకు రావడం.. కొత్త పార్టీ అనివార్యంగా పెట్టాల్సి రావడం ఇటు ఉద్యమకారులకు, బీఆరెస్ బాధిత నేతలకు, బీసీ నాయకులకు ఇది బూస్టింగ్ ఇస్తున్నది. కవితకు ఇప్పుడు వీరే అండగా నిలబడనున్నారు.
అప్పుడు కవిత కూడా వీరిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆమెకూ వీరి అవసరం ఆవశ్యం. అందుకే ఇదే మంచి తరుణమని ఇరువురు భావిస్తున్న తరుణంలో కొత్త రాజకీయం.. కొత్త వేదిక ఒకటి ఏర్పాటు అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు.
Dandugula Srinivas
Senior Journalist
8096677451