(దండుగుల శ్రీనివాస్)
ఆయన మీద ఆయన విసుర్లు వేసుకుంటాడు. చణకులు విసరుకుంటాడు. తన జీవితాన్ని ఓ జోక్‌గా చెబుతాడు. ఆయన స్టేజ్ ఎక్కితే చాలు నవ్వులు విరబూస్తాయి. ఆ మాటల్లో పంచులు పేలుతుంటాయి. కడుపుబ్బా నవ్విస్తాయి. ఆయన విశాల మనస్తత్వాన్ని ఎప్పటికప్పుడు పట్టిస్తాయి. ఇవన్నీ ఎవరి గురించి చెబుతున్నానో తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు మళ్లీ ఆయన గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోంది. ఆయన కూలీ సినిమా విడుదలకు ముందే మంచి క్రేజ్ సంపాదించుకున్నది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నాగ్ విలన్‌గా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్లు రూపేణా విడుదలకు ముందే మంచి వసూళ్లు రాబట్టింది. రేపు (14న) విడుదలకు రెడీ అయిన పాన్ ఇండియా సినిమా … ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. అంతకు మించి జనం. ఇందులో నాగ్ విలన్‌గా తొలిసారి తన కొత్త రూపం చూపబోతున్నాడు.
ఇదీ ఈ సినిమాకు కొత్త క్రేజ్‌ను తీసుకొచ్చిపెట్టింది. ఇక రజినీ దగ్గకు వద్దాం. తనపై తాను మరోసారి పంచులేసుకున్నాడాయన. ఏమని? కూలీలో సినిమా సాంగ్ విషయంలో కొరియోగ్రాఫర్ రజినీ వద్దకు వచ్చాడట. సార్ ఈ సాంగ్‌తో మనం దుమ్ము దులపాలి.. అదిరిపోవాలి..! అని అన్నాడట. వెంటనే రజినీ అందుకున్నాడిలా. బాబు..! ఈ బండి 1950 మోడల్‌ది. లక్షల కిలోమీటర్లు తిరిగింది. పార్టులు కూడా మార్చారు. నువ్వు అలా హార్డ్ స్టెప్స్ వేయిస్తే పార్ట్స్ ఊడిపోగలవు జాగ్రత్త..! జర ఈ బండికి దగ్గట్టుగా స్లో మూమెంట్స్ ఇవ్వవయ్యా బాబ్బాబు.. ప్లీజ్..! అని అడుక్కున్నాడట. ఈ మాటలు ఆయనే స్వయంగా చెప్పినవి. ఆ పంచులకు ఒకటే విరగబడి నవ్వులు. ఆత్మీయం, అభిమానం కలగలిసిన నగుమోములతో చప్పట్లు. ఆయన విశాల దృక్పథం, మనస్తత్వానికి జోహార్లర్పిస్తున్న ఆ కళ్లల్లో ఆనందభాష్పాలు.
https://www.facebook.com/share/v/1A9AejwjgN/
అంతకు ముందు కూడా ఆయన రోబో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో తనపై అమితాబ్ సాక్షిగా, ఐశ్వర్య సమక్షంలో పంచులేసుకున్నాడు. రోబో సినిమాలో తను యాక్ట్ చేస్తున్న విషయం తన చిన్ననాటి స్నేహితుడికి తెలియదట. వీరిద్దరు ఓ ఫంక్షన్లో కలుసుకున్నారట. బాగోగులున్నీ అడిగాక.. ఆ బాల్య స్నేహితుడు అడిగాడట. ఏం చేస్తున్నావిప్పుడు..అని! రోబో సినిమాలో నటిస్తున్నాను అన్నాడట. ఎవరు హిరోయిన్ అని అడిగాడట ఆ మిత్రుడు. ఐశ్వర్యరాయ్ … అని బదులిచ్చాడు తలైవా. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడట ఆ బాల్య మిత్రుడు. వెంటనే తన ఫీలింగ్స్‌ను కంట్రోల్ చేసుకోలేక…. ఏం మాయరోగం వచ్చింది అమితాబ్‌కు .. నీ పక్కన హీరోయిన్‌గా చాన్స్ ఇవ్వడమేంటీ..? అని ముఖం పట్టుకునే తన అసహనాన్ని వ్యక్తం చేశాడట. ఈ మాటలు పూర్తయ్యయో లేదో .. వేదిక మీద ఉన్న అమితాబ్‌తో సహా అంతా పగలబడి.. పడీ పడీ నవ్వుకున్నారు. దటీజ్ తలైవా!
Dandugula Srinivas
Senior reporter
8096677451