(దండుగుల శ్రీనివాస్)
విజయశాంతి సిన్మా ఉండె గప్పట్ల. కర్తవ్యం దాని పేరు. దాంట్ల విలనీగాడికి కోపమొస్తే చాలు ఓ ఊతపదం డవిలాగు వదిలెటోడు. అదప్పట్ల బాగా పేమస్. ఆడి జీవితంపై నాకు విరక్తి కలిగింది…. గిదీ గా డవిలాగు.
కవితక్కంటే మజాకా? అక్కతో పెట్టుకుంటే అంతేమరి. జనాభా లెక్కల్లోంచి పేరు గల్లంతైతది. మొన్నటి దాకా పింక్ బుక్కులో మీ పేర్లు ఎక్కుతున్నయ్ బిడ్డా..! మేం అధికారంలకి రాంగనే మీ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చినా మారుతలేరు. సన్నాసులు. పోయేకాలం. మనమేం చేస్తం. నేను కొంచెం రౌడీ టైపు .. అని నోరిడిసి మరీ చెప్పినా కూడా చెవు మీద పేను పారాడినట్టు కూడా లేదు ఎధవలకు. పోయేకాలం కాక ఇంకేంది? సరేరా బై. ఈ సుత్తంతా ఎందుకు? అసలు ఏందీ సంగతి? ఏం చెప్తామనుకుంటున్నవ్? సుత్తిలేకుండా చెప్పు… పనేం లేదనుకుంటున్నవా? అర్రే.. అంత గుస్స చేస్తే ఎట్లనే? మీకూ అక్క లెక్కనే కోపమొస్తుంది. ఇగ చెప్తా చదువుర్రి.
ఇయ్యాల ప్రెస్‌మీట్ పెట్టింది అక్క. సీఎంను తుక్కుతుక్కు తిట్టింది. రాజీనామా చెయ్యాలంటే చెయ్యాలె అని డిమాండ్ చేసింది. అదంతా బనకచర్ల ముచ్చట తియ్. మల్లా చెప్పుకుందం దాని గురించి. ఆఖర్న నా అసొంటి కొంటె ఇలేకరిగాడొకడు అడిగిండు అక్కను. గా.. తీన్మార్ మల్ల… ఇంకా అడుగుడే ఖతం గాలే. కస్సున ఒంటికాలి మీద లేచినంత పన్జేసింది అక్క. ఆడెవడు..? అన్నది. ఆన్ని ఎప్పుడో జనాభా లెక్కలకెంచి తీసేసినా..! అని బదులిచ్చింది. నోరు తెరిచి బీరిపోయి చూస్తుండిపోయిండు గా కొంటె ఇలేకరి. అక్కను ఏదో అడిగి తిప్పలుపెడుదామంటే.. తనకే షాకిచ్చిందిలే..! అని అనుకున్నడు. ఇప్పుడు పింక్ బుక్కులేదు అక్క దగ్గర. ఆ బుక్కు అన్నకే ఇచ్చినట్టుంది. అండ్ల అన్న ఎక్కిచ్చిన పేర్లున్నయి. మరి అక్క ఎక్కిచ్చిన పేర్లు దాంట్లకెల్లి తీసేసింది. ఒకయ్యాళ్ల ఆకుపచ్చ బుక్కుల ఎక్కిస్తది కావొచ్చు. జాగృతి కండువా గుర్తు గదే కదా.
Dandugula Srinivas
Senior Journalist
8096677451