(మ్యాడం మధుసూదన్
సీనియర్ పాత్రికేయులు..)
వచ్చే శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని తహతహలాడుతున్న భారతీయ జనతా పార్టీ మరోసారి డమ్మీ రాజకీయానికి తెరలేపింది. గత శాసనసభ ఎన్నికల ముందు బలమైన నాయకుడిని గద్దె దింపిన బీజేపీ.. మరోసారి బలహీనమైన నాయకుడికి పట్టంగట్టింది. అన్ని విధాలుగా అర్హులనుకున్న మాజీమంత్రి, ఎంపీ, సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్‌కు రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు బడా టక్కర్ ఇచ్చారు. సీనియర్ నాయకుల సిండికేట్ ముందు అమిత్ షా మాట కూడా బేఖాతరయ్యింది. ఆరెస్సెస్, సంఘ పరివార్ ద్వారా సీనియర్ నాయకులు ఈటలకు చెక్ పెట్టారు. పసుపుబోర్డు ప్రారంభోత్సవానికి వచ్చిన అమిత్ షా.. వాస్తవానికి బేగంపేటలో సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థి ఎవరో సూచించాల్సి ఉంది. కానీ, ఇక్కడి పరిస్థితులను పసిగట్టిన అమిత్ షా పెద్దగా ఆసక్తి చూపకుండానే రాష్ట్ర నాయకుల ఇష్టమన్నట్టు ఢిల్లీకి వెనుదిరిగారు. మొదటి నుంచి బండి సంజయ్ స్థానంలో రాజకీయంగా , సామాజికంగా బలంగా ఉ న్న ఈటల రాజేందర్ ను నియమించాలని అమిత్ షా ఆసక్తి చూపారు. కీలకబాధ్యతలు అప్పజెప్తామని అమిత్ షా ఈటలకు మాట కూడా ఇచ్చారు.
అడహక్(తాత్కాలిక) ప్రెసిడెంట్‌గా ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి .. నియమితులై రెండేండ్లు కావొస్తున్నా.. ఇప్పటి వరకు కొత్త అధ్యక్షుడిని నియమించలేదు. ఈటలకు బాధ్యతలు అప్పజెప్తామన్న సమయంలో ఏదో ఒక ఆటంకం రావడం.. బండి సంజయ్, రఘునందర్తో పాటు సీనియర్ నాయకులంతా సిద్ధాంతపరంగా, వ్యక్తిగతంగా ఆయనను విభేదించడం .. బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో ఉన్న హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఎవరికైనా పర్వాలేదు.. ఈటలకు రావొద్దన్నట్టు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు. మరోవైపు పార్టీకి మూల స్థంభాలుగా ఉండి, అంతా తామే అన్నట్టు వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి .. పార్టీ జాతీయ స్థాయి నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ తదితరులు ఈటల నాయకత్వం పట్ల సుముఖత వ్యక్తం చేయలేదు.
ఈటలకు తప్ప ఎవరికిచ్చినా ఒప్పే అన్నట్టు వ్యూహాత్మకంగా ముందుకు కదిలారు. అధిష్టానవర్గం కొత్త అధ్యక్షుడి మాట తెచ్చినప్పుడల్లా ఏదో ఒక ఆటంకం సృష్టిస్తూనే ఉన్నారు. గతంలో బండి సంజయ్‌ను ఒకవర్గం వ్యతిరేకిస్తే … ఈటలను పార్టీలోని రెండు వర్గాలూ వ్యతిరేకించాయి. వాస్తవానికి, బండి సంజయ్ స్థానంలో ఈటల రాజేందర్‌కు ఇవ్వడం వల్ల పార్టీకి ప్రయోజనం ఉంటుందని అధిష్టానం భావించినప్పటికీ.. సైద్దాంతిక వైరుధ్యాలు, రాజకీయ మూలాలను తెరమీదకు తెచ్చి ఈటలకు బ్రేకులు వేశారు. ఒక దశలో ఎందుకు లొల్లి అని, సీనియర్ నాయకులు డాక్టర్ లక్ష్మణ్‌కే పదవి కట్టబెట్టాలని ప్రయత్నించారు. లేని పక్షంలో అందరికీ ఆమోదయోగ్యంగా, రాజకీయ , సామాజికంగా బలం లేకుండా, తమ మాట వినేవాడు, సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేరును తెరమీదకు తెచ్చారు. ఈటల రాజేందర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే తమ ప్రభాల్యం తగ్గిపోతుందని చాల మంది సీనియర్ నాయకులు భావించారు. దాంతో రకరకాల ఫిర్యాదులు కూడా చేసినట్టు తెలుస్తున్నది. ఇటీవల కాళేశ్వరం విచారణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని ఏకపక్షంగా సమర్థించారని కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. కమ్యూనిజం సిద్దాంతాలు, బీఆరెస్‌తో మూలాలు ఉన్నందున ఈటల రాజేందర్ ఎప్పుడైనా టర్న్ కావొచ్చని కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసిన వారు లేకపోలేదు.
ఈ క్రమంలో ఆరెస్సెస్, సంఘ్ పరివార్ ద్వారా పావులు కదిపారు. ఇటు సీనియర్ నాయకులు సహకరించక, అటు బండి సంజయ్ వర్గం బలంగా వ్యతిరేకించడం, సంఘ్ పరివార్ విభేదించడం వంటి ఎన్నో కారణాల వల్ల ఈటల రాజేందర్ పదవిని దక్కించుకోలేకపోయారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కూడా తనకు నామినేషన్ వేయమని పిలుపు వస్తుందని ఈటల రాజేందర్ శిబిరం ఆశతో ఉంది. కానీ మధ్యాహ్నానికి ఆశలు పటాపంచలయ్యాయి. కేవలం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో మాత్రమే పరిమితమైన ప్రాభల్యమున్న రాంచంద్రారావుకు పదివిని కట్టబెట్టడం మరోసారి చర్చనీయాంశమైంది. బండి సంజయ్‌ను ఆకస్మికంగా దించినప్పునడు పార్టీ ఎంత నిరాశకు గురైందో.. ఈటలకు బాధ్యతలు అప్పగించకపోవడం పట్ల కూడా కార్యకర్తలు కూడా అంతే అసంతృప్తికి లోనయ్యారు. కొందమంది సీనియర్ నాయకులు మొదటి నుంచీ డమ్మీ రాజకీయాలతో పార్టీ ఉనికిని దెబ్బతీస్తున్నారని వారి చుట్టే రాజకీయం తిప్పుకుంటున్నారని బీజేపీలో బలమైన విమర్శలున్నాయి.
వారి వారి నియోజకవర్గంలో సీట్లు, ఓట్లు కోసం తప్ప .. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవడానికి వారు చేసిందేమీలేదని పార్గీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. సీనియర్ నాయకులు ఒక అవగాహనతో, ఒక సిండికేట్‌గా ఉండి కొత్త నాయకత్వాన్ని ఎదగనిస్తలేరనే ప్రచారం పార్టీని మరింత దెబ్బ తీస్తున్నది. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నాయకుల సిండికేట్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్న రాజాసింగ్ చివరకు రాజీనామా చేశారు. ఆయన మొదటి నుంచి సీనియర్ నాయకులు స్వార్థంతో వ్యవహరిస్తున్నారని, పార్టీని ఎదగనీయడం లేదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా కలకలం రేపుతున్నది. మాట ఇచ్చినట్టే ఇచ్చి తప్పుకోవడం, అర్హత ఉన్నా అధ్యక్ష పదవి ఇవ్వకుండా అవమాన పర్చడం పట్ల ఈటల రాజేందర్ శిబిరం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇది పార్టీలో ఏ పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.