(మ్యాడం మధుసూదన్
సీనియర్ పాత్రికేయులు..)
రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారైనట్లే. మొదటి నుంచి ఈటల రాజేందర్ పేరు ప్రతిపాదనలో ఉన్నప్పటికీ సీనియర్లు వ్యతిరేకించడం, సిద్దాంతపరంగా ఆయనకు బలం కలిసి రాకపోవడంతో పెండింగ్‌లో పడింది. రాజకీయంగా, సామాజికంగా చాలా బలంగా ఉన్నప్పటికీ సిద్ధాంతపరంగా ఆయన మద్ధతు లభించలేదు. బండి సంజయ్, ఈటల రాజేందర్ నాయకుల గ్రూపు తగాదాలతో, ఎవరికిస్తే ఏం నష్టమోనని పార్టీ భయపడింది. ఒక దశలో అందరికీ ఆమోదయోగ్యంగా పార్టీ జాతీయ స్థాయి నాయకుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్‌కు పగ్గాలు కట్టబెట్టాలనే ఆలోచన చేసింది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు పేరు జాబితాలో వస్తున్నది. నిజామాబాద్ పసుపుబోర్డు ప్రారంభోత్సవానికి వచ్చిన అమిత్ షా ఈటల రాజేందర్ పేరును ప్రతిపాదించినట్టు తెలుస్తున్నది.
30Vastavam.in (7)
ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారైందని సమాచారం. లేనిపక్షంలో, కాని పక్షంలో .. చివరి నిమిషంలో మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రారావు పేరు తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. కొత్త అధ్యక్షుడికి ఈనెల 1న ఘనంగా స్వాగతం పలకడానికి బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తున్నది.ఈటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అండగా నిలిచారు. ఈటల రాజేందర్‌కు అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల ఆయనకున్న రాజకీయ అనుభవం, సామాజిక సమీకరణలు కలిసి వస్తాయని భావించారు. ఒకవైపు ముదిరాజ్ సామాజికవర్గం, మరోవైపు రెడ్డి సామాజికవర్గం నుంచి కూడా ఆయనకు సానుకూలత ఉన్నది. ఇప్పటికే మున్నూరుకాపులకు అత్యధిక ప్రాధాన్యత ఉన్నందున ముదిరాజ్ సామాజికవర్గానికి ఇవ్వడం వల్ల పార్టీకి మరింత బలం చేకూరుతుందని లెక్కలేస్తున్నారు. మొదటి నుంచి కేంద్ర హోం శాఖ మంత్రి, పార్టీ వ్యూహకర్త అమిత్ షా ఇవే సమీకరణలలో ఈటల రాజేందర్ అభ్యర్థిత్వం పట్ల పూర్తిగా సుముఖంగా ఉన్నారు.
కానీ బండి సంజయ్‌తో పాటు ఇతర సీనియర్ నాయకులతో ఉన్న విభేదాలను ఒక కొలిక్కి తేవడానికి చాలా సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఒక దశలో ఇదంతా తలనొప్పి ఎందుకు..? డాక్టర్ కే లక్ష్మణ్‌కు పగ్గాలు అప్పగించి..ఎన్నికల సంవత్సరంలో సమర్థమైన నాయకులకు అప్పగించాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. కానీ డాక్టర్ లక్ష్మణ్‌కు ఇప్పటికే జాతీయ స్థాయిలో మూడు కీలక పదవులు ఉన్నందున ఆయన కూడా అంత సుముఖత వ్యక్తం చేయలేదు. బండి సంజయ్ కు మళ్లీ పగ్గాలు అప్పగించాలని పార్టీ కార్యకర్తలు, కొంత మంది నాయకులు కేంద్రంపై తీవ్రంగా ఒత్తిడి చేశారు. లేని పక్షంలో మధ్యే మార్గంగా డాక్టర్ లక్ష్మణ్ కు గానీ, రాంచంద్రారావు కు గానీ బాధ్యతలను అప్పగించాలని ప్రతిపాదనకు వచ్చింది. ఈ విషయంలో కేంద్ర అధిష్టానవర్గం మేథోమథనం చేయాల్సి వచ్చింది. పార్టీలో గ్రూపు తగాదాలు కొంత సద్దుమనిగిన క్రమంలో ఈటల రాజేందర్ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మొదట ఈటలకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం ఖాయమని వాస్తవం వెల్లడించింది. కానీ తీవ్ర గందరగోళ పరిస్థితుల్లో అధిష్టానం కొంత వెనుకడుగు వేసింది.
అధ్యక్ష పదవి ఫైలును పెండింగ్‌లో పెట్టింది. ఎట్టకేలకు అన్ని సమీకరణలను దృష్టిలో పెట్టుకుని ఈటల వైపే అధిష్టానం మొగ్గు చూపింది. కొత్త అధ్యక్షుడికి అపూర్వ రీతిలో స్వాగతం పలకడానికి బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తున్నది. సునీల్ బన్సాల్ రంగారెడ్డి జిల్లాలో సమావేశం పెట్టి స్వాగత సన్నాహాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడ వద్దనున్న వేద కన్వెన్షన్ వేదికగా అధ్యక్ష పదవిని ఖరారు చేయనున్నారు. సోమవారం సాయంత్రం వరకు నామినేషన్ దాఖలు కార్యక్రమం సాగుతుంది. నామమాత్రంగా రాంచంద్రారావు లాంటి ఒకరిద్దరు పెద్దలు నామినేషన్ వేసే అవకాశం ఉంది. రేపు ఉదయం 11 గంటలకు వేద కన్వెన్షన్‌లో సమావేశమై ఏకగ్రీవంగా అభ్యర్థిని ప్రకటిస్తారు. అక్కడే సన్మానాలు, సత్కారాలు, ఊరేగింపులు ఉంటాయి.