(మ్యాడం మధుసూదన్
సీనియర్ పాత్రికేయులు)
ఎంతెంతదూరం ఇంకెంతదూరం అనుకుంటు వస్తున్న బీజేపీ అధ్యక్ష పదవి ఎట్టకేలకు మరో 24 గంటల్లో తేలిపోనుంది. అధ్యక్ష పదవిని సీనియర్ నాయకులకే కట్టబెట్టాలని అధిష్టానవర్గం నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీలో గ్రూపుల తగాదాలు లేకుండా, వివాదాలకు తావు లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తికి పట్టం గట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా డాక్టర్ కే లక్ష్మణ్ పేరు తెరముందుకు వచ్చింది. మొదటి నుంచి అధ్యక్ష పదవి రేసులో మాజీ మంత్రి ఈటల రాజేందర్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వంటి పేర్లు రేసులో ఉన్నప్పటికీ గ్రూపుల తగాదా పెరిగే అవకాశం ఉన్నందున లక్ష్మణ్ పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం కేంద్ర పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న లక్ష్మణ్ గతంలో కూడా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన హయాంలో పార్టీ పెద్దగా దూసుకుపోనప్పటికీ వివాదాలకు తావు లేకుండా సాఫీగా సాగింది. ఈ పార్టీ మొదటి నుంచి అటు లక్ష్మణ్, ఇటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తున్నది.
వారిద్దరు చాలా అంశాలలో ఏకాభిప్రాయంతో ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో డా.లక్ష్మణ్‌కు పగ్గాలు అప్పగించడమే సరైన మార్గమని కిషన్‌రెడ్డి కూడా భావించినట్టు సమాచారం. మేధావిగా ముద్రపడ్డ డా.లక్ష్మణ్‌కు ఇవ్వడం గ్రూపులు గ్రూపులుగా చీలిపోయిన బీజేపీ మళ్లీ ఏకతాటిపైకి వస్తుందని అధిష్టానవర్గం భావిస్తోంది. వాస్తవానికి ఒకదశలో ఈటల రాజేందర్ పేరు దాదాపుగా ఖరారైంది. కానీ గ్రూపుల సీనియర్ నాయకులతో పాటు, పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి మొదటి నుంచి పనిచేస్తున్న నాయకులు వ్యతిరేకించారు. ఈటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అండగా నిలిచారు. ఈటల రాజేందర్‌కు అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల ఆయనకున్న రాజకీయ అనుభవం, సామాజిక సమీకరణలు కలిసి వస్తాయని భావించారు. అతిపెద్ద ముదిరాజ్ సామాజికవర్గంతోపాటు రెడ్డి వర్గం కూడా కలిసి వస్తుందన భావించారు. పార్టీలో ఉన్న రెడ్లు, బీసీలు కానీ ఆయనకు అండగా నిలవలేకపోయారు. అప్పటికే వేళ్లూనుకుపోయిన నాయకులు మరో కొత్త నాయకుడు కావడం వల్ల సమస్యలుంటాయని భావించగా, ఆరెసెస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థల నుంచి ఈటల మద్ధతు లభించలేదు.
ఈటలకు ప్రజాబలం ఉన్నప్పటికీ, పార్టీ బలం లేదని ప్రచారం జరిగింది. పైగా సిద్ధాంతపరంగా మూలాలు అధ్యక్ష పదవికి అడ్డంకిగా మారాయి. ఇటీవల కాళేశ్వరం విచారణలో గత కేసీఆర్ ప్రభుత్వాన్ని పూర్తిగా ఈటల సమర్థించారని పార్టీలో కొంతమందికి గిట్టలేదు. అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన దుమ్మెత్తిపోశారు. ఈటల రాజేందర్‌కు పగ్గాలు అప్పజెప్పడం వల్ల ఇన్నాళ్లూ జీవితమంతా పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లు సెట్‌బ్యాక్ కావాల్సివస్తుందని వాదన బలంగా తెరముందుకు వచ్చింది. ఈ క్రమంలో గతంలో డైనమిక్‌గా వ్యవహరించిన బండి సంజయ్ పేరు తెరముందుకు వచ్చింది. కానీ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ బండి సంజయ్ పట్ల అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని నివేదికల ఆధారంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆయనకు మద్ధతుగా నిలవడం లేదు. పార్టీ మరోసారి ఉరకలెత్తాలంటే బండి సంజయ్‌కే పగ్గాలప్పగించాలన్న ఈ మధ్యలో బాగా పెరిగింది. కానీ అమిత్ షా సుముఖంగా లేకపోవడంతో ఆయన సెట్‌బ్యాక్ కావాల్సి వచ్చింది. బండి సంజయ్ దూకుడు వల్ల పార్టీ బలపడ్డప్పటికీ గ్రూపులు కూడా పెరుగుతున్నాయని సీనియర్లు సైతం అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఈ మధ్యలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మరో సీనియర్ నాయకుడు ఆచారి, రఘునందన్, అర్వింద్ పేర్లు వచ్చినప్పటికీ అవి కేవలం మీడియాకే పరిమితమయ్యాయి. రాజాసింగ్ కూడా తనకు అధ్యక్ష పదవి కావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆయన పేరు పరిశీలనలో లేదు. పార్టీలో ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల బండి సంజయ్, ఈటల రాజేందర్ గ్రూపుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరడంతో అధిష్టానవర్గం సంకటంలో పడింది. ఎవరికి నాయకత్వం అప్పజెప్పినా మరో వర్గానికి గిట్టకపోవచ్చని, కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాయిదా వేస్తూ వస్తున్నారు. అధ్యక్ష పదవి ప్రకటించేందుకు కేంద్ర అధిష్టాన వర్గం అంతా ఆసక్తి చూపలేదు.
ఇక ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి చేపట్టడానికి అవసరమైతే సిద్దంగా ఉండాలని అధిష్టానవర్గం డా.లక్ష్మణ్‌కు సంకేతాలు ఇస్తూ వస్తున్నది. ఇప్పటికే జాతీయ ఓబీసీ సెల్ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర ఎలక్షన్ కమిటీ సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న డా.లక్ష్మణ్ మొదట్లో విముఖంగా ఉన్నప్పటికీ అధిష్టానవర్గం మాటను కదలేకపోయారు. కానీ ఒక బలమైన బీసీ నాయకుడికి పగ్గాలు అప్పజెప్పి 2029లో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ అధిష్టాన వర్గం మొదట గ్రూపు సమస్యలు లేకుండా చేయడానికి లక్ష్మణ్‌ను తెరమీదకు తెచ్చాయి. ఇప్పటికూడా ,ఈటల రాజేందర్, బండి సంజయ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని, డా.లక్ష్మణ్ కాని పక్షంలో మొదటి చాన్స్ ఈటల రాజేందర్‌కు, తప్పితే బండి సంజయ్‌కు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.