(దండుగుల శ్రీనివాస్)
ఎమ్మెల్సీ తరువాత మంత్రి కావాలనుకున్నాడు మహేశ్. కానీ ఆయనకు పీసీసీ చీఫ్ పదవి వరించింది. ఇక మంత్రిగా చాన్స్ మిస్సయిందని బాధపడ్డాడు. కానీ అతనికి వరుసగా కాలం కలిసి వస్తోంది. పార్టీ కమిటెడ్ వర్కర్‌గా, చాలా ఓపికతో పార్టీ కోసం నిలబడ్డ బీసీ నేతగా అధిష్టానం వద్ద గౌడ్‌కు మంచి పేరుంది. అందుకే ఆయన ఓపికకు, సహనానికి, సీనియారిటీకి, సిన్సియారిటీకి సరైన సమయంలో అధిష్టానం మంచి గుర్తింపునిస్తూ వస్తోంది. అర్బన్ ఎమ్మల్యే కావాలనుకున్నా.. అధిష్టానం టికెటిచ్చి సహకరించినా విజయం వరించలేదు. కానీ అర్బన్ రాజకీయాలపై మహేశ్‌కు చాలా ఆసక్తి.
ఎమ్మెల్సీ దక్కించుకుని ఇందూరు పై పట్టు సాధిస్తున్న తరుణంలోనే మంత్రిగా కూడా చాన్స్ కోసం ప్రయత్నం చేశాడు. కానీ అనూహ్యంగా అతనికి పీసీసీ చీఫ్ పగ్గాలు కట్టబెట్టింది అధిష్టానం. సామాజిక సమీకరణలు కలిసి రావడం, సీఎం రేవంత్ సపోర్టుగా నిలబడంతో అది సాధ్యమయ్యింది. ఇక కులగణనను అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. తెలంగాణ సర్కార్ దీన్ని చేసి మరీ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచింది. ఈ క్రమంలో కులాల సమతుల్యత పాటించడం అనివార్యతగా మారింది. అందుకే మంత్రివర్గ విస్తరణలో పూర్తిగా రెడ్లకు చెక్ పెట్టింది అధిష్టానం. దీంట్లో భాగంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమని చెబుతూ వచ్చారు.
కానీ ఈ సమీకరణలో ఆయన పేరు గల్లంతైంది. అది మహేశ్‌కు కలిసి వచ్చింది. ఇందూరు నుంచి పీసీసీ చీఫ్‌గా ఉన్న కారణంగా ఆయనే ఇప్పుడు అనధికార మంత్రి. అర్బన్ ఇంచార్జిగా షబ్బీర్ అలీ ఉన్నా.. ఆయన ఇక్కడ చుట్టుపు చూపుగానే వస్తూ వెళ్తున్నాడు. ఆయన మనసంతా కామారెడ్డిపైనే. ఈ మారిన సమీకరణలు మహేశ్‌కు మంచిగా కలిసి వచ్చాయి. మొన్నటి వరకు అనఫిషయల్ మంత్రిగా కొనసాగిన సుదర్శన్‌రెడ్డిని అధికార యంత్రాంగం పక్కన పెట్టనుంది. ఆయన ఇప్పుడు నిమిత్తమాత్రుడు. ఇకపై అన్నీ తానై ఉమ్మడి జిల్లాను నడిపించనున్నాడు మహేశ్. ఒకవైపు కీలకమైన పీసీసీ చీఫ్ పదవి దక్కించుకున్న మహేశ్.. ఇప్పుడు సొంత గడ్డలో తనే ఓ మంత్రిగా కూడా చెలామణి కానున్నాడు.