(దండుగుల శ్రీనివాస్)
నిజామాబాద్‌లో ఆమె ఆటలు సాగనివ్వలేదు మొన్నటి వరకు. ఆమెను కలిస్తే చాలు.. దూరం పెట్టేవారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు వారు తాజా మాజీలు. అక్క వేరు కుంపటి పెట్టనుందని తేలింది. తాజా మాజీలపై మామూలుగా లేదు కోపం. అందుకే ఇప్పుడు ఏ గట్టునుండాలో తేల్చుకునే సమయం వచ్చింది. అన్నతో విబేధించి, తండ్రితో కయ్యం పెట్టుకుని తన దారి తాను చూసుకునే పనిలో ఉన్న అక్క .. ఇవాళ తన సొంతూరు ఇందూరు వచ్చింది. అంతా ఆసక్తి. ఆమెను కలుస్తారా..? అని. ఎందుకంటే గతంలో ఆమెతో ఫోటో దిగితే చాలు ఎమ్మెల్యేలు దగ్గరికి రానిచ్చేవారు కాదు.
అరేయ్ వాడు ఆ గ్రూపురా పక్కన పట్టేసేయండి.. అని బాహాటంగానే ఆర్డర్ వేసేవారు ఆనాటి ఆ పార్టీ సిట్టింగులు. ఇచ్చిన వారికే టికెట్లిచ్చి.. వ్యతిరేకతను కూడా లెక్క చేయకుండా కేసీఆర్ చేసిన తప్పుకు.. ఆ పార్టీ ఇందూరులో నామ రూపాల్లేకుండా పోయింది. ఇంత జరిగినా ఇంకా ఆ తాజా మాజీలను పట్టుకునే వేలాడాలా..? అందులోనూ అక్క ఓపెన్‌గా చెప్పేసింది లేఖలో తండ్రికి. ఇంకా వారేనా ఇంచార్జిలు.. వాళ్లే బీ ఫారాలు ఇవ్వాలా..? నో నత్తింగ్. నడవదు. మీ నుంచే రావాలి.. అన్నది. ఈ మాట బాగా నచ్చింది వారికి. అందుకే అక్క పంచన చేరారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో తాజా మాజీల కబంధ హస్తాల ద్వారా కాకుండా కొన్ని అక్క చేతుల మీదుగా బీ ఫారాలు వస్తాయని క్లారిటీ వస్తోంది వారికి.
అందుకే పో పోవోయ్.. ఏం చేసుకుంటావో చేస్కో..? ఇంకా ఎన్ని రోజులు నీకు భయపడుకుంటా ఉండాలె అంటూ అక్క దగ్గర వచ్చేశారు బాజాప్తాగా. భయం లేకుండా. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని. ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది ఇందూరు బీఆరెస్ రాజకీయాల్లో.
