(దండుగుల శ్రీనివాస్)
యూట్యూబర్లకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్. యూట్యూబర్ల ముసుగులో జర్నలిస్టుల పేరుతో ఏది బడితే అది వార్తగా మలిచేయొచ్చు.. బూతుల వీడియోలు పెట్టొచ్చు.. సీఎం అని చూడకుండా , మంత్రులను లెక్కచేయకుండా అమ్మాఅక్క ఆలీ చెల్లి అంటూ బూతులు పోస్టు చేస్తే.. ఇక మీ భరతం పడతామన్నాడు. మాములుగా కాదు. బజారులో బరిబాతల బట్టలిప్పి కొడతామని వార్నింగ్ ఇచ్చాడు.
దీనిపై ఇటీవల ఓ జర్నలిస్టు అరెస్టయిన విషయం తెలిసిందే. అక్కడ అసభ్యకర వీడియోలు పోస్టు చేయడం మూలంగానే అరెస్టు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చిన సీఎం.. ఈ వైఖరి పరాకాష్టకు చేరిందన్నాడు. అడ్డూఅదుపు లేకుండా పోయిందని గుస్సా అయ్యాడు. హద్దలు దాటి సుద్దులు చెబుతున్నారని మండిపడ్డాడు. ఇకపై ఇలాంటివి చెల్లవన్నాడు. జర్నలిస్టులెవరో తేలాల్సిందేనన్నాడు. గుర్తింపు కార్డులు లేకపోతే.. ఇక అంతే సంగతులనే వార్నింగ్ కూడా ఇచ్చేశాడు.
జర్నలిస్టు సంఘాల నేతలకు సూచన చేశాడు. సేమ్ గతంలో మాదిరిగానే. జర్నలిస్టులెవరో..? వారి ముసుగులో ఉన్న అరాచకశక్తులెవరో తేలాల్సిందేనన్నాడు. కావాలంటే అసెంబ్లీలో చర్చకు పెడదామన్నాడు. సపరేట్ చట్టంతెస్తానన్నాడు. ఉన్న చట్టాలు కూడా మారుస్తానన్నాడు. ఇదంతా చేయిస్తుంది కేసీఆర్ అండ్ ఫ్యామిలీనేనని కూడా నిర్దారించేశాడు. ఇది మానుకోవాలని వారికి ఈ వేదికగా హితవు పలికాడు.