వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌:
మూసీ నది పునరుద్ధరణను అత్యంత అవసరమైన అద్భుతమైన కార్యక్రమంగా అభివర్ణించారు ప్రొఫెస‌ర్‌, ఎమ్మెల్సీ కోదండ‌రామ్‌. ప‌ట్టణీకరణ మీద అధ్యయనం చేసిన నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించామని, స్వీకరించిన ఆ సలహాలను ప్రభుత్వం ముందు ఉంచుతున్నామని తెలిపారు. తెలంగాణ జన సమితి అధ్యక్షులు , ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం బుధ‌వారం నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో కుల గణనను స్వాగతిస్తున్నామని తెలిపారు. కుల గణన ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, దాని ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఇప్పుడు ఎక్కడ ఉందో అని ప్రశ్నించారు. ప్రజల మధ్య సమగ్ర కుటుంబ సర్వే నివేదిక పెట్టలేదని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పచ్చ జెండా ఊపిన ప్రాజెక్టులు, పథకాలను ఇప్పుడు విమర్శించడం, వ్యతిరేకించడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడం అవసరం కానీ, దుర్భాషలాడడం సరికాదని హితవు పలికారు.

ప్రజా సంక్షేమానికి సమగ్రమైన అభివృద్ధి

ఆర్ఓఆర్ బిల్లుపైన కూడా అధ్యయనం చేస్తున్నామని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. నదులు, చెరువుల పునరుద్ధరణ వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ అందించాలని, ప్రజా సంక్షేమానికి ఇది ఎంతో అవసరమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై అభినందనలు…

పేద ప్రజల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తున్నామని, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటామని ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు.ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు చిలగాని సంపత్ కుమార్ స్వామి , కోదండరాం సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బైరి రమేష్, పల్ల వినయ్ కుమార్, టీజేఎస్ యూత్ రాష్ట్ర అధ్యక్షులు సలీమ్ పాష, టీజేఎస్ గ్రేటర్ హైదరాబాదు జిల్లా అధ్యక్షులు నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టల రాంచందర్, టీజేఎస్ పార్టీ కార్మిక నాయకులు ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.