(దండుగుల శ్రీనివాస్)
అతడు అంతలా అక్రమాస్తులకు ఎగబాగాడంటే నేతల అండ లేకుండానేనా..! అస్సలు సాధ్యం కాదు. ఈ నరేందరుడి కథలోనూ ఇదే మెలిక ఉంది. కానీ అంతకు మించి ఇంకా ఉంది. అదేంటో తెలుసా..? ఇతనికి ఒక్కరు కాదు అందరూ నేస్తాలే. అ న్ని పార్టీల నేతలూ దోస్తులే. పదేళ్లుగా ఇక్కడే తిష్ట వేసాడంటే మాములు విషయం కాదు. అంతా మామూళ్ల విషయమే. అవును.. ఇతను తీసుకుని పోగేసుకున్న ఆస్తులకు అండ నేతలే. వారికీ అంతో ఇంతో నయానో బయానో సమర్పించుకున్నాడు. అందుకే ఎవరూ కిమ్మనరు. అందరివాడన్నమాట ఈ దాసరి నరేందర్.
ఇందూరు మున్సిపాలిటీలో కింది స్థాయి ఉద్యోగి నుంచి సూపరింటెండెంట్ దాకా ఎగబాకిన వైనం.. అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అందరి తలలో నాలుకలా మెలుగుతూ ఎవరికి ఏం కావాలో చేసిపెట్టే ఘనుడు. దానికి తగ్గట్టు ప్రతిఫలం పొందే అక్రమార్జన ఆఫీసరు. ఇలా కోట్లకు ఎగబాకాడు. ఆఖరికి అదే అక్రమార్జనతో ఓ భూమి కొనుగోలు చేసేక్రమంలో ఏసీబీ చేతికి చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ నరేందర్ అక్రమాస్తుల చిట్టా పెద్దగానే దొరికింది.
ఇందూరు ఏసీబీ చరిత్రలో నిలిచాడు నరేందర్. అప్పటి మేయర్ ధర్మపురి సంజయ్ దగ్గర నుంచి ఇప్పటి మేయర్ దండుశేఖర్ నీతూ కిరణ్ వరకు… ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు.. కార్పొరేటర్ల నుంచి ఆఫీసర్ల వరకు అందరూ ఇతనికి దోస్తులే. ప్రీతిపాత్రులే. అందరికీ జూ హుజూర్ అంటాడు. వంగి వంగి దండాలు పెడతాడు. చెప్పిన పని టక్కున చేసిపెడతాడు. అందుకు తగ్గ ప్రతిఫలం వెంటనే తీసేసుకుంటాడు. మంచి నేర్పరి. చేతగాడు, రాతగాడు. పోటుగాడు, కేటుగాడు, నోటుగాడు, వేటగాడు.. ఇలా చాలానే బిరుదులు ఇవ్వొచ్చు.
చివరకు ఇతను దొరికింది దుబ్బ కలెక్టరేట్ సమీపంలోని బైపాస్ వద్ద రెండెకరాల భూమిని కొనుగోలు చేసేందుకు సిద్దపడి డబ్బు సిద్దం చేసుకున్నాడు. లేకపోతే అంత డబ్బు ఇంట్లో ఎక్కడిది..? మరి ఏసీబీకి ఎలా తెలిసింది…? ఈ భూమి బేరం జరుగుతున్న నాటి నుంచి నరేందర్‌కు పోటీ మరొకరు వచ్చారు. అది నాక్కావాలని. కానీ నరేందర్ తన పరపతినంతా ఉపయోగించి తనే కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చాడు. శుక్రవారం మంచి రోజు కావడంతో డబ్బు తెచ్చుకుని ఇంట్లో రెడీగా పెట్టుకున్నాడు. ఈ సమాచారాన్ని ఏసీబీకి ఇచ్చాడు పోటీదారుడు. దీంతో వల పన్నారు. అప్పటికే వారం రోజుల నుంచి అంతా రెడీ చేసుకున్నారు పట్టుకోవడానికి.
ఇలా మంచి రోజు శ్రావణ శుక్రవారం దొరికిపోయాడు. కలెక్టరేట్ వద్ద ఇ ప్పటికే ఎకరం భూమి కొనుగోలు చేసి ఉన్నాడు గతంలో నరేందర్. కానీ మాజీ ఎమ్మెల్యే అతని పై ఒత్తిడి తెచ్చి అగ్వకు తను కొనేశాడు అది వేరే విషయం అనుకోండి.