దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రతినిధి:
వెనుకటికొక పిల్లి ఉండేదట. ఓ ఇంట్లో జొరబడి రోజుకొక ఎలుకను పొతం పడుతున్నదట. మెల్లమెల్లగా ఎలుకల సంతతి మొత్తం తగ్గుతూ వస్తుందట. ఓ రోజు పిల్లులన్నీ కలిసి ఓ అత్యవసర భేటీ పెట్టుకున్నాయట. ఈ పిల్లి బారిన పడకుండా ప్రాణాలు కాపాడుకోవాలంటే ఏం చేయాలి..? అని ఆ ఎలుకల టీమ్ పెబ్బ మిగిలిన ఎలుకలను అడిగిందట. ఓ ఎలుక లేచి ఆ పిల్లి వచ్చేటప్పుడు మనకు దాని చప్పుడు తెలియాలంటే దాని మెడలో ఓ గంట కట్టాలని సలహా ఇచ్చిందట. వరుసగా ఎలుకలు ఒక్కొక్కటిగా లేస్తూ.. ‘అవును.. ఇదే కరెక్టు పరిష్కారం అధ్యక్ష..! ఆ పిల్లి మెడలో వెండి గంట కట్టాలి’, ‘లేదు లేదు బంగారు గంట కట్టాలి’, కాదు వజ్రాలతో పొదిగిన కాస్ట్లీ గంట కట్టాలి..’ అని చెప్తూ పోతున్నాయట. పెబ్బ ఎలుకకు చిరాకొచ్చి… ‘ గంటలు కట్టడం సరే.. అసలు ఎవరు పిల్లి మెడలో గంట కట్టేందుకు వెళ్తారు..?’ అని అడిగేసరికి, ఎలుకలన్నీ ఒకరి ముఖాలొకటి చూసుకుని తలలు నేలకేశాయట. నావల్ల కాదంటే నావల్ల కాదని మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాయట. ఇదీ ఓ పిట్ట కథ.
ఈ కథకు మన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విషయంలో జరుగుతున్న తంతుకు ఓ లింకు ఉంది. అర్వింద్ అంటే పడని, గిట్టని, అసంతృప్తి, అసమ్మతి వాదులు చాలా మందే ఉన్నారు ఆ పార్టీలో. ఈసారి టికెట్ రావొద్దని కూడా కోరుకున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేశారు అధిష్టానం వద్ద టికెట్ రానీయకుండా. కానీ చివరకు అధిష్టానం అర్వింద్ వైపే మొగ్గు చూపింది. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రటించేసింది. ఇక అసమ్మతి నేతలంతా మెల్లగా కలుగులోంచి ఎలుకల్లా బయటకు వస్తున్నారు. తాజాగా ఆ పార్టీ లీడర్, కార్పొరేటర్ భర్త మీసాల శ్రీనివాస్ ఢిల్లీ వెళ్లి మరీ అక్కడ ప్రెస్‌మీట్ పెట్టి చెప్పడం పార్టీలో కలకలం రేపింది. అర్వింద్‌పై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇతనికి టికెట్ ఇవ్వొద్దని అధిష్టానాన్ని కోరాడు. పనిలో పనిగా అర్వింద్ ఓ అహంకారి, దుర్మార్గుడు అంటూ దుమ్మెత్తిపోసి వచ్చాడు. అర్వింద్ మెడలో అసమ్మతి గంట కట్టడం పూర్తయ్యింది. ఇక ఒక్కొక్కరుగా కలుగులోంచి బయటకు రావడమే మిగిలుంది.