దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి: ఒకప్పుడు ఘనకీర్తి. కంచుకోట. తిరుగులేని శక్తి. కానీ ఓడిన వెంటనే అంతా ఆగమాగం. అప్పటిదాకా అధికారాన్ని అనుభవించిన ఎమ్మెల్యే మాజీ అయ్యాడు. ఇటువైపు రావడం లేదు. కీలకనేతలంతా కాంగ్రెస్‌లోకి జారుకుంటున్నారని తెలిసినా.. చీమకుట్టినట్టైనా లేదు. పోతేపోనీ అంటున్నాడు బిగాల .. కేటీఆర్ మాదిరిగానే. జిల్లాకు పెద్ద దిక్కనుకుంటున్న ఎమ్మెల్సీ కవిత కూడా ఇటు చాయలకు కూడా రావడం లేదు. ఆమె ఇక్కడి నుంచి పోటీ చేసేలా లేదు. మెదక్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పార్టీకి గుండెకాయలాంటి అర్బన్‌ను గాలికొదిలేశారు వీరిద్దరు. ఇంకేముంది..? కీలక నేతలంతా పక్కదారి పట్టారు. మేయర్‌తో సహా కార్పొరేటర్లు, కీలక నేతలంతా కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. వారంలో భారీగా బీఆరెస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి చేరేందుకు రెడీ అయ్యారు నేతలంతా.
ఇంత తెలిసినా.. బిగాల ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు. తను మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేసేదుందా..? గెలిచేదుందా.? అని అనుకుంటున్నాడు కాబోలు. పార్లమెంటు ఎన్నికల దగ్గర పడే సమయానికి ఇందూరు బీఆరెస్ ఖాళీ అయ్యేలా ఉంది. ఉద్యమకారులు మాత్రం పార్టీని అంటిపెట్టుకుని ఉండేలా ఉన్నారు. ఉద్యమకారులకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా వారిని అవమానించే రీతిలో వ్యవహరించిన నేతలు ఇప్పుడు పార్టీ కళ్లముందే ఆగమవుతుంటే తమాషా చూస్తున్నారు. ఉద్యమకారులు ఇంకా పార్టీనే నమ్ముకుని ఉన్నారు. వారినీ కాపాడుకునే స్థితిలో కవిత లేదు. నియోజకవర్గ మీటింగులు ఆమె లేకుండానే అయిపోతున్నాయి. బోధన్‌కు దిక్కులేకుండా పోయింది. ఆర్మూర్ అంతంతే. అర్బన్ మొత్తం ఆగమాగమైపోయింది. నిజామాబాద్ రూరల్‌కు టైమిచ్చినట్టే ఇచ్చి కేటీఆర్ డుమ్మా కొట్టాడు. మొత్తానికి జిల్లాను గాలికొదిలేశారు అంతా కలిసి. ఎవరి దారి వారు చూసుకోండని చెప్పకనే చెబుతున్నారు ఈ నేతలంతా.