దండుగుల శ్రీనివాస్
వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్:
ఎమ్మెల్సీ కవిత తన ఆవేదనను, ఇన్నాళ్లూ భరిస్తూ వచ్చిన మనోవేదనను ఒక్కసారిగా వెళ్లగక్కింది. పార్టీకి, క్యాడర్‌కు నష్టం వాటిల్లుతున్న ఏమీ చేయాలని తన నిస్సహాయ స్థితిని బయటపెట్టింది. ఎవరికి వల్ల ఎలా నష్టం జరిగిందో అన్ని సెక్షన్లకు పార్టీ ఎలా దూరమయ్యిందో.. ఎవరు దీనికి కారకులో ఆమె విడమర్చి,వివరంగా,పరోక్షంగా చెప్పి అందిరినీ అవాక్కయ్యేలా చేసింది. నిజామబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సన్నాహాక సమావేశంలో కవిత తనలోని అంతరంగాన్ని ఆవిష్కరించింది. ప్రధానంగా అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలను ఆమె టార్గెట్ చేశారు. తను ఎవరినైనా పరామర్శించేందుకు వెళ్లాలన్నా, పెళ్లిలకు హాజరుకావాలన్నా.. ప్రొటోకాల్ పేరుతో మేము లేకుండా ఎలా వెళ్తావంటూ తనను నిలువరించిన వైనాన్ని ఆమె ఆవేదనగా వివరించారు. ఇన్నాళ్లు ఇలాంటి ఆంక్షలు తనను, పార్టీ క్యాడర్‌ను ఎలా ఇబ్బందులు పెట్టాయో.. పార్టీని తననుంచి ఎంతలా దూరం చేశాయో ఆమె చెప్పకనే చెప్పుకున్నారు.
తన మనసులోని భారాన్నంతా దింపుకున్నారు ఈ వేదికగా.తల్లి వేరు లాంటి పార్టీని కాపాడుకోవాలనే కనీస సోయి లేకుండా సిట్టింగులు తనను ఆంక్షల వలయంలో ఉంచి నాయకులకు, క్యాడర్‌కు అందుబాటులో లేకుండా చేశారని ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగించందన్నారు. ఎవరైనా తనతో, కేటీఆర్‌తో సెల్ఫీలు దిగినా.. ఎవరికి చెప్పి వెళ్లారు..? ఎందుకు వెళ్లారు.? అంటూ వారిని అంటరాని వారుగా చేసి ఒంటరి వాళ్లను చేసి ఆడుకున్నారని సిట్టింగుల ఆకృత్యాలన్నీ ఒక్కొక్కటిగా బయటపెట్టారామె. ఆమె ఇలా మాట్టాడుతుందని ఎవరూ ఊహించలేరు. ఓసారి మనోవేదన వెళ్లబుచ్చుతూనే కాళికావతారాన్నీ ఆమె ప్రదర్శించింది. కేటీఆర్‌నూ వదల్లేదు. పార్టీ పదవులు ఇవ్వడంలో నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో చేసిన జాప్యం ఇంతటి నష్టానికి ప్రధానకారణమే అని దీనికి కేటీయారే బాధ్యుడు అనే విధంగా ఆమె కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఇది ఒకరకంగా అందరికీ షాకింగే. ఎలాగైనా తాను నిజామాబాద్ పార్లమెంటును గెలిచి కేసీఆర్ కానుకగా ఇస్తానని చివరలో ముక్తాయించడం… నేతల సహకారం ఉన్నా లేకున్నా ఒంటరి పోరు చేసేందుకైనా రెడీ అనే విధంగా ఆమె ఈ వేదికగా శపథం చేసినట్టుగా మాట్లాడటం ఇందూరు బీఆరెస్ నాయకుల్లో చర్చకు తెరతీసింది.