ఎమ్మెల్సీ కవిత ఇన్చార్జిగా ఉన్న రెండు నియోజకవర్గాల్లో ఒకేరోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బోధన్‌లో బీఆరెస్ పార్టీ సీనియర్ నేత, తన భార్య మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరగా… అర్బన్‌లో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత .. బీఆరెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్దమయ్యారు. పార్టీలో గుర్తింపు లేదని, ఆత్మగౌరవం లేని చోట ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని కుండబద్దలు కొట్టి మరీ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు ఆకుల లలిత. ఆ పరిణామం అర్బన్ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని, నిజామాబాద్ అర్బన్ టికెట్ కోసం ట్రై చేస్తున్నారని వస్తున్న ప్రచారం నిజమేనని తేలుతోంది. దాదాపుగా అర్బన్ టికెట్ ఆకుల లలితకు కన్‌ఫాం అయినట్టుగా తెలుస్తోంది.
కాంగ్రెస్‌లో జిల్లా నుంచి మున్నూరుకాపులకు ప్రాతినిధ్యం లేకుండా చేశారనే అపప్రదను పార్టీ ఆకుల లలితకు అర్బన్ టికెట్ ఇచ్చి ఓ బీసీకి ఇచ్చామని నిరూపించుకునేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఆకుల లలిత బీఆరెస్‌కు రాజీనామా చేయడం వెనుకు కారణాలను విళ్లేషిస్తూ అధిష్టానికి ఓ లేఖ కూడా రాయనున్నట్టు తెలుస్తోంది. జరగబోయే ప్రమాదాన్ని ముందే గ్రహించినా ఇటు కవిత గానీ, అటు అధిష్టానం గానీ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు, బుజ్జగింపు చర్యలు తీసుకోకపోవడం బీఆరెస్ పార్టీ ఈ కీలక సమయంలో మరింత నష్టపోయేలా చేసిందని రాజకీయ విళ్లేషకులు భావిస్తున్నారు.
బోధన్‌లో ఎమ్మెల్యే ఆగడాలు, నరకయాతన భరించలేకే పార్టీ వీడుతున్నట్టు ప్రకటించిన శరత్‌రెడ్డి…. ఇక్కడ అర్బన్‌లో కూడా కనీసం తమకు ఎమ్మెల్యేలు టైమ్ కూడా ఇవ్వడం లేదని తమకు మర్యాద కూడా దక్కడం లేదనే విషయాన్ని ప్రస్తావించడం సిట్టింగు ఎమ్మెల్యేలపై ఎంతటి వ్యతిరేకత ఉన్నదో అద్దం పడుతోంది. బీ ఫామ్‌లు ఇచ్చే సమయంలో కేసీఆర్ మరీ మరీ చెప్పాడు. అందరినీ కలుపుకొని పోవాలి.. ఈగోలు, అహంకాలు వీడాలని, కానీ అప్పటికే చాలా ఆలస్యమయ్యింది. చాలా మంది కార్యకర్తలు దూరమయ్యారు. దూరమవుతున్నారు. వేరే దారులు చూసుకుంటున్నారు. బీఆరెస్‌కు దెబ్బ దెబ్బ పడే సూచనలు కనిపిస్తున్నాయి.