ఆగస్టు నెలలో మొఖం చాటేసిన వరణుడు సెప్టెంబర్ లో మళ్లీ భారీ వర్షాలతో పలుకరించాడు. నెల రోజుల క్రితం లేకుండా కురిసిన వర్షాలు మళ్లీ దాదాపు నెల రోజులపాటు లేకుండా పోయాయి. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాభావం తొలగని ప్రాంతాల్లో వానల కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి కనిపించింది. ఈ పరిస్థితుల్లో మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలు సర్వత్ర సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఈ నెలలో వర్షాలు పుష్కలంగా ఉంటాయని వాతావరణ శాఖ ముందుగానే చెప్పిన విధంగా వర్షాలు కురుస్తుండడంతో ఇక డోకా లేదని నిశ్చింత రైతన్నల్లో కనిపిస్తున్నది.
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగింది. సోమవారం మధ్యాహ్నం లోపే సుమారు 51 వేల క్యూసెక్కుల వరద రావడంతో.. అప్పటికే నిండుగా ఉన్న ప్రాజెక్టు లోకి వస్తున్న వరదను గోదావరిలోకి వదలక తప్పని పరిస్థితి ఉండడంతో నాలుగు గేట్లు ఎత్తి 12 వేల క్యూసెక్కుల జలాలను దిగువకు వదిలారు. అయితే రాత్రి వరకు వరద ఉధృతి మరింత పెరిగింది. దీంతో 26 గేట్లను ఎత్తారు. 46వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో 26 గేట్లను ఎత్తారు. వీటి ద్వారా 99 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు..ఎస్ ఆర్ ఎస్ పి ప్రస్తుతం 90 పి ఎం సి లు, 1091 అడుగుల దాని ఫుల్ రిజర్వాయర్ లెవెల్ లో ఉంది.