ఇప్పటికే ఒక మెగాజాబ్‌ మేళాను నిర్వహించి విజయవంతం చేసిన తరహాలోనే ఈనెల 29న కూడా ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో, ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్టు తైక్వాండో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒలంపిక్‌ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, యువనేత బాజిరెడ్డి జగన్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం రూరల్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఆయన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవతో 35 పేరుమోసిన ప్రముఖ కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు తీసుకుని, అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు.

నగర శివారు బోర్గాం వద్ద గల భూమారెడ్డి కన్వెన్షన్‌ హాల్‌లో ఈనెల 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఇంటర్వ్యూల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. పదో తరగతి పాసయిన వారి నుంచి మొదలుకొని టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, డిగ్రీ, పీజీ.. ఉన్నత విద్యనభ్యసించిన ప్రతీ ఒక్కరూ ఈ ఇంటర్వ్యూలలో హాజరుకావొచ్చని జగన్‌ వివరించారు. వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాజిరెడ్డి టీమ్‌ అన్ని ఏర్పాట్లు చేసిందని, భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేశామని, నిజామాబాద్‌ జిల్లా యువతతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన యువతీ యువకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ మెగా జాబ్‌మేళాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కొలువుల ప్రక్రియను ఎమ్మెల్సీ కవిత నిరంతర ప్రక్రియగా మార్చారని, ఇది యువతకు సువర్ణవకాశం లాంటిదని ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పేరుమోసిన ప్రముఖ కంపెనీలైన అపోలో మొదలుకొని, ఫార్మా కంపెనీలు, జస్ట్‌ డయల్‌, జియో, ఇటాచీ, ఆటోమోబైల్‌, హెల్త్‌ సెక్టార్‌ తదితర ప్రముఖ కంపెనీలన్నీ ఇందూరుకు క్యూ కట్టేలా కవిత ప్రత్యేక చొరవ తీసుకుని ఇక్కడి యువతీ యువకులు మంచి కొలువులు సాధించి భవిష్యత్తులో స్థిరపడేలా చేస్తున్నారని వివరించారు. ఇందూరు ఐటీ హబ్‌లో గతంలో నిర్వహించిన జాబ్‌మేళాతో వందల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని, మళ్లీ ఇటాచీ కంపెనీతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడి మరో వంద మంది వరకు ఉపాధి అవకాశం దొరికేలా చేస్తున్నారని వివరించారు.

ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ,ఈ జాబ్‌మేళాకు పెద్ద ఎత్తున యువతీ యువకులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఐటీ హబ్‌కు సమాంతరంగా టాస్క్‌ను కూడా ఏర్పాటు చేయడం ద్వారా అర్హతలను బట్టి నిరంతరం శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేసిందని వివరించారు. విలేకరుల సమావేశంలో నుడా చైర్మన్‌ ఈగ సంజీవరెడ్డి, టీఆరెస్‌ సీనియర్‌ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, చింత మహేశ్‌, బాజిరెడ్డి టీం సభ్యలు తిరుమల్‌, నవనీత్‌రెడ్డి, సంజయ్‌, రాకేశ్‌, టాస్క్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ శ్రీనాథ్‌రెడ్డి, రీజనల్‌ సెంటర్ ఇంచార్జి రఘుతేజ తదితరులు పాల్గొన్నారు.

You missed