సీఎం కేసీఆర్‌ది ఎంతో గొప్ప మనస్సని, ఎప్పట్నుంచి బాధల్లో, కష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు ఆయన గొప్ప వరం అందించి వారి కష్టాలన్నీ ఏకకాలంలో పోగొట్టారని టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. కేబినెట్‌ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొంతకాలంలో ఆర్టీసీ కార్మికులు ఎంతో మనోవేదనకు గురవుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వీరికి స్వరాష్ట్రంలో సముచిత స్థానం దక్కలేదని, ఏపీ రాష్ట్రంలో అక్కడ ఉద్యోగులు ఎంతో సంతోషంగా ఉన్నారనే భావన వారిలో ఉండేదని గుర్తు చేశారు. ఇవాళ కేసీఆర్ ముందు రెండు డిమాండ్లను తాను పెట్టానని, ఒకటి.. వెయ్యి కోట్ల నిధి గ్యారెంటీని కల్పిస్తే పీఎఫ్‌ చెల్లించి వారికి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ మంచిగా దక్కేలా చూడాలని .. రెండు పీఆర్‌సీ చెల్లించాలని కోరామన్నారు.

కానీ ఇవన్నీ తలకిందులు చేస్తూ కేసీఆర్‌ ఏకంగా కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడంతో అందరి కోరిక నెరవేరిందని, ఇది ఎంతో పెద్ద మనస్సుతో ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్‌ ఇచ్చిన వరమని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 43వేల మంది కుటుంబాల్లో ఆయన వెలుగులు నింపారని, మేమంతా ఎప్పటికీ ఆయన చేసిన మేలును మరిచిపోమని, రుణపడి ఉంటామని బాజిరెడ్డి ఉద్యోగుల పక్షాన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఓ వైపు కార్పొరేషన్లను అమ్ముకుంటూ ఉద్యోగులను నడిబజార్లో పడేస్తుంటే.. కేసీఆర్‌ మాత్రం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారనడానికి ఇదే తాజా నిదర్శనమని, కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో చేర్చుకోవడం చిన్న విషయమేమీ కాదని, ఈ నిర్ణయం దేశానికే ఆదర్శమన్నారు.

ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, తాను ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఉద్యోగులకు కొంత మేలు చేయగలిగామన్నారు. కానీ లాభాల బాట పట్టించలేకపోయామని, కొంత నష్టాన్ని నివారించగలిగామని, ఇప్పుడు కేసీఆర్ నిర్ణయంతో ఇక ఉద్యోగుల కష్టాలకు శాశ్వత పరిష్కారం దొరికిందని అన్నారు. ఈనిర్ణయాన్ని యావత్ రాష్ట్ర, దేశ ప్రజలు కూడా హర్షిస్తున్నారని అన్నారు. ఏపీ ప్రభుత్వం అక్కడ తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో కమిటీ ద్వారా అధ్యయనం చేసి అంతకన్నా మెరుగైన లబ్ది చేకూరేలా ఇక్కడ నిర్ణయాలు అమలు చేస్తామన్నారు. ఈ అసెంబ్లీ సెషన్లోనే ఈ బిల్లు పాస్‌ చేసి ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేర్చుతామని, వారి ఉద్యమ స్పూర్తికి కానుకగా దీన్ని అందిస్తామని బాజిరెడ్డి తెలిపారు.

You missed