బోధన్ బీఆరెస్ బరి నుంచి షకీల్ సతీమణి..
మహారాష్ట్రకు షకీల్‌కు… బోధన్ నుంచి ఆయేషా పాతిమా..
మారుతున్న సమీకరణలు… మహారాష్ట్ర బాధ్యతల్లో బిజీ బిజీగా షకీల్…
వాస్తవం- బోధన్ ప్రతినిధి:
ఇందూరు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఎవరికి వారు పోటీకి సిద్దమవుతున్నారు. పార్టీల ప్లాట్‌ఫామ్‌లు వెతుక్కుతుంటున్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఈసారి అక్కడి నుంచి పోటీ చేయడం లేదు. వాస్తవంగా అక్కడ షకీల్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి మళ్లీ ఇక్కడ పోటీకి సిద్దపడుతుండటంతో సానుభూతి కలిసి వచ్చి కాంగ్రెస్సే గెలిచే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఈ పరిణామాలను ముందే పసిగట్టాడు అధినేత కేసీఆర్.
మహారాష్ట్ర బీఆరెస్ బాధ్యతలను షకీల్‌కు అప్పగించాడు. అక్కడ మీటింగులు, చేరికల విషయంలో షకీల్ బిజీబిజీగా ఉన్నాడు. అసలే నియోజకవర్గానికి సమయం ఇవ్వడు. ఇక మహారాష్ర్ట బీఆరెస్ బాధ్యతలు అప్పగించడంతో కనీసం ఇక్కడ కనిపించడం కూడా లేదు. కానీ ముందస్తుగానే ఆయన తన సతీమణి ఆయేషా ఫాతిమాను నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలకు పంపుతున్నాడు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నుంచి మొదలుకొని బర్త్‌డే, పెళ్లిళ్లకు కూడా ఆమే ఈ మధ్య హాజరవుతున్నది. తెలుగు స్పష్టంగా రాకున్నా, హిందీ,తెలుగు కలిపి మాట్లాడుతూ నెట్టుకొస్తుంది.
తనపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్న కారణంగా ఈ సారి తన సతీమణి బోధన్ నుంచి అవకాశం ఇవ్వాలని షకీల్ కోరుతున్నాడు. దీనికి అధినేత కూడా ఒప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయేషా ఫాతిమాకు బోధన్ నుంచి పోటీలో నిలిపి… షకీల్‌కు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఏదైనా ఒక చోట నుంచి పోటీలో నిలిపాలని కూడా యోచిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. బోధన్ నుంచి మైనార్టీకి తప్ప వేరొకరికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. షకీల్ తప్ప అక్కడ మరో ఆప్షన్ లేదు. అందుకే ముందు జాగ్రత్తగా షకీల్ తన సతీమణిని నియోజకవర్గం అంతా తిప్పుతున్నాడు.
ఇప్పుడు తనకు బీఆరెస్ బాధ్యతలు ఇవ్వడంతో తనకు డబుల్ ధమాకా దొరికినట్టేనని షకీల్ భావిస్తున్నాడు. అధినేత సూచన ప్రకారం మహారాష్ట్ర నుంచి ఏదో ఒక చోట నుంచి పోటీ చేసి… తన భార్యను బోధన్ నుంచి గెలిపించుకోవడం ద్వారా తన అస్థిత్వాన్ని, అనుచరగణాన్ని కాపాడుకున్నట్టవుతుందని భావిస్తున్నాడు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి గట్టి ఫైట్ ఇచ్చినా… మైనార్టీ ఓట్లే షకీల్ భార్య గెలుపుకు ఇతోధికంగా ఉపయోగపడతాయని అధిష్టానం కూడా భావిస్తోంది.