ఆశావహులపై ఆరా..

ఎమ్మెల్సీ ఆశిస్తున్న నేతలపై కూపీ లాగుతున్న ఇంటెలిజెన్స్‌..

అధిష్టానానికి సమాచారం చేరవేత…

కేబినేట్‌ మీటింగులో పేర్ల క్లారిటీ.. జిల్లాలో ఉత్కంఠ రేపుతున్న గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ సీటు…

వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్‌:

గవర్నర్‌ కోటాలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానం కోసం నిజామాబాద్‌ జిల్లా నుంచి నేతలు చాలా మందే ట్రై చేసుకుంటున్నారు. ఈ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న రాజేశ్వర్‌ పదవీకాలం ఈనెలాఖరుతో ముగుస్తుంది. ఈలోపు కేబినేట్‌ భేటీ జరగనుంది. ఆ సమావేశంలో రాష్ట్రంలో గవర్నర్ కోటాలో ఖాళీ కాబోతున్న రెండు స్థానాలకు అభ్యర్థి పేర్లను ఫైనల్‌ చేసి గవర్నర్‌కు పంపనున్నారు సీఎం కేసీఆర్‌. మొన్న ఎమ్మెల్యే కోటాలో వీజీ గౌడ్‌కు స్థానం ఖాళీ అయ్యింది. అది మళ్లీ తనకే ఇస్తారని అనుకున్నాడు వీజీ గౌడ్‌.

ఆయనతో పాటు చాలా మందే లైన్లో ఉన్నారు. జిల్లా నుంచి ఎవరికీ రాలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ జిల్లా నుంచి ఎమ్మెల్సీ సీటు ఖాళీ అవుతున్నందున ఎవరికి వారు ఆశిస్తున్నారు. దీంట్లో వీజీ గౌడ్‌ తన సామాజిక వర్గానికే ఇస్తారని ఆశిస్తున్నందున ఈ సారి అవకాశం ఉండొచ్చనుకుంటున్నాడు. లైన్లో ఈగ గంగారెడ్డి, మధు శేఖర్, రాజారాం యాదవ్‌, ఆకుల లలిత, మారయ్య గౌడ్‌…. ఉన్నారు. వీరంతా ఎవరికి వారు అధిష్టానానికి తాము ఉన్నామనే విషయాన్ని ఏదో రకంగా తెలియజేసి ఉన్నారు. ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధినేత నిర్ణయం కోసం. ఎవరెన్ని చెప్పినా.. కేసీఆర్‌ మదిలో ఎవరి పేరుంటుందో ఎవరికీ తెలియదు. కానీ ఆశించడం మాత్రం మానలేదు. ప్రయత్నించడమూ ఆపడం లేదు.

అయితే… జిల్లా నుంచి ఎమ్మెల్సీని ఆశిస్తున్న వారిపై ఇంటెలిజెన్స్‌ ఆరా తీసినట్టు తెలిసింది. అభ్యర్థి నేపథ్యం.. ప్రజల్లో వారికున్న అభిప్రాయం.. సేవ కార్యక్రమాలు.. తదితర విషయాలపై లోతుగా కూపీ లాగినట్టు సమాచారం. ఈసారి జిల్లా నుంచి ఎవరి పేరు లేకపోతే జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కోల్పోయినట్టేననే బీఆరెస్‌ నేతలు భావిస్తున్న తరుణంలో ఈ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానంపై ఆశవహులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఎలాగైనా జిల్లాకు ఎమ్మెల్సీ దక్కుందని భావిస్తున్న వీరు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ రెండు స్థానాలు పోతే.. ఇక మిగిలింది స్థానిక సంస్థల కోటానే. ఈ నియోజకవర్గం నుంచి కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఆమె ఎంపీగా పోటీ చేస్తే ఇది ఖాళీ కానుంది. అప్పుడు మరొకరికి ఈ ఛాన్స్‌ దక్కే వీలుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.