ఆశల పల్లకీలో…
ఎమ్మెల్సీ బరిలో మనోళ్లు…
జిల్లా నుంచి గవర్నర్ కోటాలో తమకు అవకాశం కావాలని అభ్యర్థనలు..
వచ్చే నెలాఖరుతో ఎమ్మెల్సీ రాజేశ్వర్ పదవీకాలం పూర్తి….
వారం రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థల పేర్లు ఖరారు… కేసీఆర్ మదిలో ఎవరున్నారో…
అంతటా ఉత్కంట… ఇదే చర్చ…
వాస్తవం ప్రతినిధి: నిజామాబాద్
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఖాళీ కాబోతుంది. వచ్చే నెల 27కు రాజేశ్వర్ పదవీ కాలం ముగియనుండటంతో ఈ కోటాలో తమ అదృష్టాలు పరిశీలించుకునేందుకు ఎవరి యత్నాల్లో వారున్నారు. జిల్లా నుంచి ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా వీజీ గౌడ్ పదవీకాలం ముగిసింది. తనకు మళ్లీ అదే కోటాలో ఎమ్మెల్సీని చేస్తారని వీజీ గౌడ్ ఆశించారు. కానీ అధినేత కేసీఆర్ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు రాజేశ్వర్ టైమ్ వచ్చింది. జిల్లా నుంచి రెండో ఎమ్మెల్సీ కూడా ఖాళీ అవుతుండటంతో ఈసారి నాకు అవకాశం ఇస్తే బాగుండని ఎవరికి తోచిన దారిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజేశ్వర్ తనకు మళ్లీ అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నా… కేసీఆర్ అందుకు ఇష్టపడటం లేదు. మూడు పర్యాయాలు ఎమ్మెల్సీగా చేసిన రాజేశ్వర్‌కు ఈసారి ఛాన్స్ లేనట్టే. ఎమ్మెల్యే కోటాలో తనకు మళ్లీ ఛాన్స్ వస్తుందనుకుని భంగపడ్డ వీజీ గౌడ్ ఈ గవర్నర్ కోటాలో కూడా ట్రై చేసుకుంటున్నాడు.
మొన్న జరిగిన రూరల్ నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో వీజీ గౌడ్‌ను ఉద్దేశించి ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ మాజీ ఎమ్మెల్సీగా తను సంభోదించడం లేదని, మళ్లీ ఎమ్మెల్సీ అవుతారని ఆశాభావం వ్యక్తం చేయడం అక్కడ చర్చకు తెర తీసింది. ఇక ఈ ఎమ్మెల్సీ కోసం ఆకుల లలిత కూడా ఆశిస్తున్నారు. ఆమెకు గతంలో స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా చేస్తామన్నారు. చివరి వరకు ఆమె పేరే వినిపించింది. కానీ అనూహ్యంగా కవిత ను ఎమ్మెల్సీ చేశారు. అప్పటికే ఆమె ఎంపీగా ఓడిపోయి ఉండటం.. జనంతో మమేకమయ్యేందుకు ఓ పదవి అవసరంగా కేసీఆర్ భావించారు. దీంతో లలిత ఆశలకు గండిపడింది. ఆ తర్వాత చాలా రోజులకు ఆమెకు ఉమెన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్‌ను చేశారు. కానీ లలితకు ఎమ్మెల్సీ ఇస్తారనే నమ్మకం ఉంది. కేసీఆర్ నజర్‌లో తనకు మంచి పేరు ఉండటంతో అవకాశం రాకపోతుందా..? అని ఆమె కూడా ఎదురుచూస్తున్నారు.
పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉండి సీనియర్ నేతగా ఉన్న ఈగ గంగారెడ్డి కూడా ఎప్పటి నుంచో పదవి కోసం ఎదురుచూస్తున్నారు. తనకు తగిన గుర్తింపునివ్వడం లేదని ఆ మధ్య అలక వహించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. కానీ అసంతృప్తి అలాగే ఉంది. ఈ సారైనా ఎమ్మెల్సీకి తన పేరును పరిశీలిస్తారా..? అని తనకున్న పరిచయాలతో ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. డాక్టర్ మధుశేఖర్ కూడా తనకు ఎమ్మెల్సీ వస్తుందని ఆశిస్తున్నాడు. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్ తనకు ఎమ్మెల్సీ ఇస్తారని భావిస్తున్నాడు. కానీ ఇప్పటికే మూడు మూడు పదవులు ఇవ్వడంతో ఆయనకు ఇస్తే వ్యతిరేకత వస్తుందనే భావనలో అధిష్టానం ఉంది.
మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, విద్యావేత్త కోటాలో ఎస్‌ఎస్‌ఆర్ విద్యాసంస్థల అధినేత మారయ్యగౌడ్ లు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని సమీకరణల లెక్కలు వేసుకున్నా.. అధినేత నిర్ణయమే ఫైనల్. కేసీఆర్ మదిలో ఏముందో చివరి వరకు ఎవరూ ఏమీ చెప్పలేరు. గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని ఎవరికి వారు ఆశల పల్లకీలో విహరిస్తున్నా.. అధినేత మనుసులో మాట ఏమిటో తెలియక చివరి వరకు ఉత్కంఠతో ఎదురుచూసే పరిస్థితులున్నాయి. మరో వారంలోగా ఈ ఉత్కంఠకు తెరపడనుంది.