లోక కళ్యాణార్థం శ్రీ కృష్ణ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి వారి విశ్వ మంగళ శాసనములతో నిర్వహిస్తున్న ఆయుత చండి అతిరుద్రం-పూర్ణ హుతి కార్యక్రమం చివరి రోజున వింత చోటు చేసుకుంది. పార్టీలకతీతంగా ఆథ్యాత్మిక చింతనలో, భక్తి భావనలో నిర్వహించిన ఈ యాగం ఈనెల 5న ప్రారంభించారు. దాదాపు పదిహేను రోజుల పాటు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. రాజకీయ నాయకులు, నగర, నగర శివారు ప్రాంత ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యాగం చివరి రోజైన శుక్రవారం రాత్రి పది గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పలు సంభవించారు. గాలి దుమారం.. పెద్ద ఎత్తున వచ్చిన ఈదురు గాలులతో స్వల్పంగా వర్షం పడింది. ఈ యాగం పై అదే సమయంలో పెద్ద శబ్దంతో పిడుగు పడింది. నేరుగా జెండా పై నుంచి ప్రధాన యాజ్జకుండలిలో పిడుగు పడటంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కపడ్డారు.
ఆ సమయంలో అక్కడ కొంత మంది రాజకీయ ప్రముఖులు, భక్తులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే చివరి రోజున ఇలా అగ్గి పిడుగు పడటం ఎంతో శుభసూచకమని స్వరూపానంద స్వామి పేర్కొన్నారు. ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. అయితే కేసీఆర్ చేసిన ఆయుత చండీయాగంలో కూడా చివరి రోజు యాగశాలకు మంటలు అంటుకున్నాయి. అప్పుడు కూడా ఈ చర్చ వచ్చింది. దాన్ని కూడా శుభసూచకంగా వేదపండితులు పేర్కొన్నారు. కాగా ఇక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ యాగం చివరి రోజున అగ్గి పిడుగు పడటంతో ఇందూరు ప్రజలకు యాగఫలం దక్కిందని భావిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు శాంతి పూజలు నిర్వహిస్తున్నట్టు వేద పండితులు పేర్కొన్నారు. ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, నిజామాబాద్ అర్బన్, ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా యాగాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షించారు. శాంతి పూజల్లో పాల్గొన్నారు