ఈసీ ని అడ్డం పెట్టుకొని బీజేపీ కుట్రపూరిత రాజకీయం చేస్తోంది
ఈసీ వైఖరి అభ్యంతరకరం
2011లో నిషేధించిన రోడ్డు రోలర్ గుర్తు మళ్లీ ఎలా కేటాయిస్తారు..?
– మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటుప్పల్:
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి మద్దతుగా చౌటుప్పల్ మండలం డి. నాగారం,దామెర గ్రామాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వృద్ధులను,మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు.
ఈ సందర్భంగా దేవలమ్మ నాగారం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ కి చెందిన 9 వార్డ్ మెంబెర్ బొమ్మ లింగుస్వామి,అనుచరులు…8వ వార్డుకు చెందిన లింగుస్వామి,ముదిరాజ్ సంఘ యువత, వివిధ సంఘాల నుంచి పులువురు యువకులు సుమారు 50 మంది మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి మంత్రి సాదరంగా ఆహ్వానించారు.
అదే విధంగా దామెర గ్రామానికి చెందిన 6వ వార్డు మెంబర్ సాతరి రజిత-సురేష్,బీజేపీ నాయకులు నారెడ్డి శేఖర్ రెడ్డి పలువురు యువకులతో కలిసి మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి మంత్రి వేముల టిఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..
మునుగోడులో ప్రతి ఇంటికి కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని,ప్రజలే స్వచ్చందంగా ముందుకు వచ్చి టిఆర్ఎస్ పార్టీ కి ఓటు వేస్తామని చెప్తున్నారని అన్నారు. ఇంతటి ఆదరణ ఏ ఎన్నికల్లో చూడలేదని తెలిపారు. కేసిఆర్ అందించే కళ్యాణ లక్ష్మి,షాదిముబారక్,కేసిఆర్ కిట్,రైతు బంధు,రైతు భీమా,24 గంటల కరెంట్ లాంటి ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని అన్నారు. అభివృద్ది చేసే గుర్తు టీఆర్ఎస్ కారు గుర్తు అని అమ్ముడు పోయిన గుర్తు బీజేపీ పువ్వు గుర్తు అని అన్నారు.
18వేల కోట్లకు అమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ప్రజలు బహిరంగంగానే అసహ్యించు కుంటున్నారన్నారు. నామినేషన్ రోజే రాజగోపాల్ రెడ్డి డకౌట్ అయ్యాడని ఇదివరకే చెప్పానని గుర్తు చేశారు. బాగా మాటలు చెప్తున్న బీజేపీ నాయకులు…ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో 600 పెన్షన్ ఇస్తున్నారన్న సంగతి తెలుసుకోవాలని అన్నారు. బీజేపీ నాయకులు ఎన్ని నాటకాలు వేసిన మునుగోడు ప్రజలు నమ్మరన్నారు. టీఆర్ఎస్ పై గెలవలేకనే ఎన్నికల కమిషన్ ను అడ్డుపెట్టుకుని బీజేపీ కుట్ర పూరిత రాజకీయం చేస్తుందని విమర్శించారు. 2011 లోనే నిషేధించిన రోడ్డు రోలర్ గుర్తును మళ్ళీ ఎలా కేటాయిస్తారని ఈసీ తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దొడ్డిదారిలో గెలవాలనే వ్యూహంలో భాగంగా బీజేపీ కుట్రలకు తెరలేపిందని,ప్రజలను తికమక పెట్టి గెలవాలని చూస్తుందని మండిపడ్డారు. బీజేపీ కి ఓటమి భయం పట్టుకుందని అందుకే ఈసీ ని అడ్డం పెట్టుకొని అక్రమంగా వ్యవరిస్తోందని అన్నారు.
అయినా మునుగోడుప్రజలు చైతన్య వంతులని,అన్ని గమనిస్తున్నారని అన్నారు. నాలుగేళ్లలో ఏం చేయని వ్యక్తి ఇప్పుడేం చేస్తాడు,రాజగోపాల్ రెడ్డి స్వార్ధంతో ఉప ఎన్నిక వచ్చిందని ప్రజలే చర్చించుకుంటున్నారని అన్నారు. కొయ్యలగూడెం – డి.నాగారం సుమారు 5 కోట్ల వరకు ఖర్చు అయ్యే కొత్త రోడ్డును వేయిస్తామని, 30 లక్షల వరకు అయ్యే డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామని మంత్రి గ్రామస్థులకు హామీ ఇచ్చారు. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే టి ఆర్ ఎస్ అభ్యర్థి గెలవాలని, అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు. ఇక్కడి ప్రజల మాటల్లో చూస్తే బీజేపీ కి కర్రు కాల్చి వాత పెట్టడానికి రెడీగా ఉన్నారని అర్థమయ్యింది అన్నారు. బీజేపీ,కాంగ్రెస్ నేతల మాటలు ప్రజలు నమ్మడం లేదని, టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం ఖాయమయ్యిందని మంత్రి వేముల స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సి శేరి సుభాష్ రెడ్డి,ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక టీఆర్ఎస్,సీపీఐ నాయకులు,ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.