విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాల‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం వేముల సురేంద‌ర్ రెడ్డి. త‌న రాజ‌కీయ ప‌య‌న‌మంతా ప్ర‌జ‌ల‌తో, రైతుల‌తో , మ‌హా నేత‌లైన కేసీఆర్, ఎన్టీఆర్ లాంటి వారి స‌హ‌చ‌ర్యంలో మ‌మేక‌మ‌వుతూ సాగినా… ఆద్యాంతం ప్ర‌జాబ‌లం నిండుగా ఉన్నా త‌న‌ముందే ఎంద‌రో ప్ర‌భుత్వ ఉన్న‌త అంద‌లాలు అందుకున్నా త‌ను మాత్రం విలువ‌లు, నిజాయితీ, విశ్వ‌స‌నీయ చ‌ట్రం దాట‌కుండా త‌న ఫెయిల్యూర్ స్టోరీనే చూసుకున్నాడు. కానీ, విలువ‌లు, నిజాయితీ గ‌ల స‌క్సెస్ స్టోరీగా నిలిచిపోయాడు. స‌ర్పంచ్‌గా, భీమ్‌గ‌ల్ పంచాయితీ కో ఆప్ష‌న్ స‌భ్యుడిగా , పీఏసీఎస్ చైర్మ‌న్‌గా, డీసీసీబీ డైరెక్ట‌ర్‌గా, ఉమ్మ‌డి రాష్ట్ర ఎన్ఎస్ఎఫ్ చైర్మ‌న్‌గా, టీడీపీలో, టీఆరెస్‌లో రైతు విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడిగా … ఇలా ఎన్నో ప‌ద‌వులు అలంక‌రించారు.

ఎన్టీఆర్‌, కేసీఆర్‌కు స‌న్నిహితుడిగా, రైతు సంబంధ సంక్షేమ ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న‌లో పాల్గొన్నారు. ఇంత‌టి ఉన్న‌త స్థానాల్లో ఉన్న త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాల‌ను త‌ను న‌మ్మిన విలువ‌ల కోసం వ‌దులుకున్నారు. సంక్షోభ స‌మ‌యంలో చంద్ర‌బాబు ప‌క్షాన నిలిస్తే త‌క్ష‌ణ ఉన్న‌త రాజ‌కీయ ప‌ద‌వుల‌కు అవ‌కాశం ఉన్నా గానీ ఎన్టీఆర్ ప‌క్షాన్నే నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ప‌రిష్కారం అని న‌మ్మి కేసీఆర్‌తో జ‌త‌క‌లిశారు. రైతుల‌కు సేవ‌లు అందించిన నేత‌గా నిలిచారు. 1942 డిసెంబ‌ర్ 8న నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో జ‌న్మించిన ఆయ‌న 2018 ఆగ‌స్టు 27న ప‌ర‌మ‌ప‌దించారు. జీవితంలో విలువ‌లు గ‌ల నేత‌గా, అత్యుత్త‌మ ప్ర‌తిభ గ‌ల జాతీయ క్రీడాకారుడిగా, డబుల్ ఎంఏ చ‌దివి చ‌క్క‌ని బ‌హుభాషా ప్రావీణ్యం క‌లిగిన విద్యావంతుడిగా, వీట‌న్నింటికీ మించి ప్రేమ‌, ఆప్యాయ‌త‌ల‌కు చిరునామాగా, అభిమానుల్లో పెద్ద‌సారుగా నిలిచిపోయారు.

తండ్రిలాగే విలువ‌ల రాజ‌కీయాలు చేస్తాన‌ని చెప్పి మ‌రీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న త‌న‌యుడు రాష్ట్ర మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి.. తండ్రి అడుగు జాడ‌ల్లో , ఆయ‌న ఆశ‌యాల సాధ‌న‌లో వెనుక‌డుగు వేయ‌డం లేదు. త‌న తండ్రి రైతుల కోసం క‌న్న క‌ల‌ల‌ను సీఎం కేసీఆర్ స‌హాయంతో ఎస్సారెస్పీ రివ‌ర్స్ పంపింగ్‌, వాగుల నిండా చెక్ డ్యాంలు, కొత్త గా ఎన్నో లిఫ్టులు క‌ట్టించి నెర‌వేరుస్తున్నాడు. తండ్రి స్మార‌కార్థం వేల్పూర్‌లో 30 ల‌క్ష‌ల‌తో రైతు వేదిక భ‌వ‌నం నిర్మించి ఇచ్చాడు. బాల్కొండ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు స్వ‌ర్గ ర‌థాన్ని అందించి సేవ‌లు అందిస్తున్నాడు.