కేసీఆర్ చొరవతో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు

యువతకు ఉచిత పోలీస్ శిక్షణకై వెబ్ సైట్

బాల్కొండ సెగ్మెంట్ యువత కోసం సొంత ఖర్చుతో ప్రత్యేక యాప్ ఏర్పాటు

-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

  • నిజామాబాద్, బాల్కొండ:

ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా భర్తీ చేయనున్న 80 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలలో 95 శాతం కొలువులు స్థానికులకే దక్కనున్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.ఆదివారం బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గడిచిన ఏడు సంవత్సరాలలో 1లక్షా 30వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. తాజాగా మరో 80వేల ఉద్యోగ నియామకాల కోసం త్వరలోనే నోటిఫికేషన్ వెలువరించనుందని తెలిపారు. స్థానికులకే కొలువులు దక్కాలనే తపనతో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభించేలా కృషి చేశారని అన్నారు.దీనివల్ల నిజామాబాద్ జిల్లాలోనూ 1978 ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయని మంత్రి పేర్కొన్నారు. పోలీస్ శాఖ లోనే వెయ్యి కానిస్టేబుల్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నారని వివరించారు. ఆసక్తి, అర్హత కలిగిన యువతీ యువకులకు పోలీస్ శాఖలో ఉద్యోగాలు పొందేలా దాతల సహకారంతో ఉచిత శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.మంత్రి అద్వర్యంలో నిజామాబాద్ సీపీ నాగరాజు పర్యవేక్షణ లో ఈ శిక్షణ శిబిరం ప్రారంభం కానుంది. ఆసక్తి గల యువత ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.దీనికి సంబంధించిన వెబ్ సైట్ ను ప్రత్యేకంగా రూపొందించామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.వేల్పూర్ లో ఉదయం మంత్రి సంబంధిత వెబ్సైట్ ప్రారంభించారు.

బాల్కొండ నియోజకవర్గ యువత కోసం తన సొంత ఖర్చుతో ప్రత్యేకంగా యాప్ ను అందుబాటులోకి తెస్తున్నానని, ఆయా ఉద్యోగాల కోసం అర్హత కలిగిన యువతకు వీడియోల ద్వారా మెరుగైన శిక్షణ అందుతుందని, తద్వారా అత్యధిక మంది ఉద్యోగాలు పొందేందుకు ఆస్కారం వుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయిస్తోందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ సి.పి నాగరాజు, అడిషినల్ కలెక్టర్ చంద్రశేఖర్,ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ రఘు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.