రాజకీయాలు విచిత్రంగా మలుపులు తిరుగుతున్నాయి. సాధారణ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభిస్తున్నారు. ఎవరు శత్రవువులు.. ఎవరు మిత్రులో తేల్చుకున్నారు. మొన్నటి వరకు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఖుల్లం ఖుల్లా . పాలకు పాలు నీళ్లకు నీళ్లు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలపై నజర్ పెట్టాడు. అందుకే ఇప్పుడు దేశ సమస్యలు, అక్కడి లీడర్ల లొల్లీ మనకు అవసరమవుతున్నది. అవి వార్తలవుతున్నాయి. అవి ఎంత వరకు వచ్చాయంటే … సీఎంలపైనే కేసులు పెట్టుకునే వరకు. అంతగా వేడెక్కాయి రాష్ట్ర, దేశ రాజకీయాలు.
రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడు సెక్షన్ ల పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అస్సాంలో అక్కడ బీజేపీ లీడర్లు ఇచ్చిన ఫిర్యాదుతో సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేశారు.
అసలేం జరిగింది..? అందరికీ తెలిసిన విషయమే. రాహుల్‌పై అనుచిత వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ ఖండించాడు.ఇంత దిగజారి రాజకీయాలు చేస్తారా..? అని తీవ్రంగా మండిపడ్డాడు. రాహుల్‌ను సమర్థించడం, తన వ్యాఖ్యలను తప్పుబట్టడంపై అస్సాం సీఎంకు మండినట్టుంది. అసలు రాహుల్ ఏమి అడిగాడో తెలుసా..? సర్జికల్ స్ట్రైక్ పై ఆధారాలున్నాయా..? ప్రూప్స్ చూపించమన్నాడు. దీన్ని కూడా సమర్థిస్తావా.. కేసీఆర్ అని ట్విట్టర్‌లో స్పందించాడు. దీన్ని మన విలేకరులు మోసుకొచ్చి మొన్నకేసీఆర్ ప్రెస్ మీట్‌లో అడిగారు. దీనిపైనా అంతే ఘటుగా స్పందించాడు కేసీఆర్. అవును .. రాహుల్ అడిగిందాంట్లో తప్పేం ఉంది…? జవాన్లు చేసిన ప్రాణత్యాగాలను కూడా మీరు పార్టీకి మేలు జరిగేలా ప్రచారం చేసుకుంటారా..? మీ ఖాతాలో వేసుకుంటారా..? జవాన్లకు సలాం చేస్తాం.. మీకు కాదు.. నిజంగా నాకు కూడా అనుమానమే ఉంది. ఏదీ చూపించండి ఆధారాలు..? అని అనేసరికి చర్చ మరింత వేడెక్కింది. ఇలా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు పోయింది. ఇంక ముందు ముందు ఏమేమీ చూడాల్సి వస్తుందో…?