హుజురాబాద్ పోలింగ్ మొదలైంది. ఎన్ని రోజుల పాటు సాగిన ఈ ఉప ఎన్నిక పోరు ఫలితాలు ఈవీఎంలల్ నిక్షిప్తం అవుతున్నాయి. వచ్చే నెల 2న కౌంటింగ్ ఉంది. మరో రెండు రోజులు ఉత్కంఠ కొనసాగనుంది. మూడో రోజు మధ్యాహ్నం వరకు ట్రెండ్స్ ఎలా ఉన్నాయో తేలిపోనుంది. ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయో కౌంటింగ్ రోజు రెండు మూడు గంటల్లోనే స్పష్టం కానుంది.
దుబ్బాక తరహా ఓటింగే జరిగి ఉంటే.. ప్రతీ రౌండ్‌లో కూడా ఉత్కంఠ కొనసాగనుంది. కానీ ఇక్కడ అలా ఉంటుందా? అనేది చూడాలి. దుబ్బాకతో పోల్చితే ఈ ఉప ఎన్నికలో టీఆరెస్ శక్తి వంచన లేకుండా కృషి చేసింది. అన్ని శక్తులూ ఇక్కడే మోహరించాయి. విపరీతమైన ఖర్చు కూడా చేసింది. ప్రచారానికి ఎక్కువ సమయం ఉండటం కూడా టీఆరెస్‌కు కలిసివచ్చిందనే చెప్పాలి. అధికారాన్ని వినియోగించుకుని చాలా వరకు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో టీఆరెస్ సక్సెసయ్యిందనే చెప్పాలి.
మొదటి నుంచి చివర వరకు కూడా ఈటల రాజేందర్ అదే టెంపోను కొనసాగిస్తూ రావడం విశేషం. టీఆరెస్ ఇంతలా శ్రమపడినా.. అంతే పోటీనిస్తూ వచ్చాడు ఈటల. ఎక్కడా టీఆరెస్ గెలుపు నల్లేరు మీద నడకే అన్న మాట వినపడలేదు. పోటీ హోరా హోరీగా ఉంటుందనే టాకే మొదటి నుంచీ ఉంది. చివర వరకు ఇద్దరూ పోటీలు పడి ఫేక్ ప్రచారాలకు తెగబడ్డారు. వీటి ప్రభావం ఎంతుంటుందో తెలియదు. ఈ ఎన్నిక ఫలితాలపై మాత్రం అంతటా ఉత్కంఠ కొనసాగుతున్నది. కేసీఆర్ దీన్నిఅత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అందరి దృష్టి సహజంగానే పడింది.
ఇంతలా పోటీలు పడి ప్రచారం చేసుకున్న ఈ ఎన్నికలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తుంది. గతంలో జనరల్ ఎన్నికలో నమోదైన పోలింగ్ కంటే చాలా ఎక్కువ పోలింగ్ నమోదయ్యేలా వాతావరణం కనిపిస్తున్నది. ఇది ఎవరికి అనుకూలమో …? ఎవరికి ప్రతికూలమో తెలియదు. దండలెవరికో..? దండనెవరికో తెలియదు. ఇది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాలి.
ఎవరు గెలిస్తే వారికి దండలు పడతాయి. ఓడిన వారికి దండన ఫలితం తప్పదు. కానీ ఇక్కట ఈటల ఓడినా దండించినట్టు కాదు. ఎందుకంటే ఇంతటి పోరులో పోరాడి ఓడిన అభ్యర్థిగానే చూస్తారు తప్పితే.. ఘోరంగా ఓడిపోయాడు.. చిత్తుగా ఓడిపోయాడు… టీఆరెస్ భారీ విజయం లాంటి మాటలు ఈ ఉప ఎన్నికలో వినపడవు. ఎందుకంటే పరిస్థితి అలా తయారు చేశారు. టీఆరెస్ ఓడితేనే దండించినట్టు లెక్క. అంటే…. టీఆరెస్ దండలేసుకుంటుందా? దండించబడుతుందా..? తేలాల్సి ఉంది.