బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ నిన్న ఓ లేఖ రాసిండు. కేసీఆర్ సారూ..! వీటికి జ‌వాబులు చెప్పండి.. అని. మొత్తం ప‌ది ప్ర‌శ్న‌లు సంధించిండు. ఇవి ప్ర‌శ్న‌ల్లా లేవు. త‌ను రెగ్యుల‌ర్‌గా స్పీచ్‌లో మాట్లాడే రొటీన్ రొడ్డ‌కొట్టుడు ఆరోప‌ణ‌ల కూడిన మాట‌ల్లాగే ఉన్నారు. ఆ లేఖ‌లో ప‌స లేదు. పంచ్ అస‌లే లేదు. స‌బ్జెక్టు భూత‌ద్దం పెట్టి వెతికినా దొర‌క‌దు. చివ‌ర‌కు బాధ్య‌త గ‌ల పార్టీగా ప్ర‌జ‌ల ప‌క్షాన బీజేపీ రేపు మ‌రిన్ని ప్ర‌శ్న‌లు సంధించ‌నున్న‌ది.. అని ముక్తాయించాడు.

ప్ర‌జ‌ల ప‌క్షాన ప్ర‌శ్న‌లు సంధిస్తున్నావు బాగానే ఉంది. అస‌లు ప్ర‌జ‌లేం కోర‌కుంటున్నారు? వాళ్ల స‌మ‌స్య‌లేవీ? ఇంకా ఏమేమీ కావాల‌నుకుంటున్నారు? సంక్షేమ ప‌థ‌కాలు అంద‌రికీ అందుతున్నాయా? పెండింగ్‌లో ఏమేమున్నాయి..? నిధుల కొర‌త ప్ర‌జ‌ల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతున్న‌ది? క‌రోనా ప్ర‌భావం ఇంకా ఎలా పీడిస్తున్న‌ది. ఉపాధి అవ‌కాశాలు మెరుగుప‌డ్డాయా? నిరుద్యోగులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లేమిటి?… ఇలా ఎన్నో ఉన్నాయి ప్ర‌జా స‌మ‌స్య‌లు. అవ‌న్నీ ఒదిలేసి.. అవినీతి.. అవినీతి… అవినీతి.. ఈ ప‌దం లేకుండా ఒక్క ప్ర‌శ్న లేదు.

రోజూ నువ్వు ఇవ‌న్నీ మాట్లాడుతున్న‌వే క‌దా బండి. మ‌ళ్లా ప్ర‌త్యేకంగా లేఖ రూపంలో వాటినే అచ్చేసి .. అవి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ని క‌ల‌రింగిచ్చి న‌వ్వుల పాలుకాక‌పోతే ఏంటిది? అస‌లు ఇన్ని రోజులు పాద‌యాత్ర చేశావు క‌దా? ఇంతేనా నువ్వు తెలుసుకున్న‌ది. అస‌లు ప్ర‌జ‌ల‌ను క‌లిశావా? లేక‌పోతే మ‌న టీమ్‌నే వెన‌కేసుకుని అలా తిరిగి క‌ల‌రింగిచ్చి.. ఫోటోల‌కు ఫోజులిచ్చి.. రొటీన్ స్పీచ్‌నే దంచిందే దంచి దంచి వచ్చేస్తున్నావా? వ్య‌వ‌హార‌రం చూస్తే అట్ల‌నే అనిపిస్తుంది.

నువ్వు మ‌రింత స్ట‌డీ చేస్తే నిజ్జంగా.. నిజాయితీగా… ప్ర‌జా స‌మ‌స్య‌లు కోకొల్ల‌లుగా ఉన్నాయి. ప్ర‌భుత్వ వైఫ‌ల్యం కొట్టొచ్చిన‌ట్టుగా నీకు క‌నిపిస్తుంది. కానీ ప‌ట్టుకోవ‌డంలోనే ఉంది నీ ప‌నిత‌నం. ప్ర‌జానాడి తెలుసుకోవ‌డంలోనే ఉంది నీ నాయ‌క‌త్వ ప‌టిమ‌. నీలో అది లేదు. ఆరోప‌ణ‌ల‌తో పెద్ద‌గా అరిస్తే.. బ‌ట్ట‌కాల్చి మీదేసిన‌ట్టు చేస్తే ప్ర‌జ‌లు దాన్ని న‌మ్ముతారు… దాన్నే ఎంజాయ్ చేస్తారు..? ఇలా ఇంకెంత కాలం అనుకుంటావు సంజ‌య్‌. కొడితే సూటిగా త‌గ‌లాల దెబ్బ‌. స‌బ్జెక్టు, కంటెంటు లేక‌పోతే నీ డైలాగుల్లో ద‌మ్ములేన‌ట్టే బండి. అర్జెంటుగా నీకు స‌ల‌హాలు ఎవ‌రిస్తున్నారో మార్చేయ్. లేదా నీ వైఖ‌రే మార్చుకో. ఇదే మూస‌, రొటీన్ రొడ్డ కొట్టుడు డ‌విలాగులు వినీ వినీ జ‌నం విస్తుపోయి విసిగెత్తిపోగ‌ల‌రు. జ‌ర చూసుకో..!

You missed