కేంద్రం పెట్రోల్‌ను జీఎస్టీ ప‌రిధిలోకి తెస్తుంద‌ని, ఆమాంతం పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గిపోతాయ‌ని ఆ మ‌ధ్య ఓ వార్త వ‌చ్చింది. ఆ వార్త చ‌ద‌వీ, చూడ‌గానే.. అప్పుడే పెట్రోల్ లీట‌రుకు ఓ యాభైకో, అర‌వైకో ప‌డిపోయినంత సంబ‌ర‌ప‌డి .. చంక‌లు గుద్దుకున్నారంతా. అబ్బ‌.. మ‌నోళ్లు ఎంత‌టి అల్ప సంతోషులో క‌దా..!

ఈ క‌రోనా క‌ఠిన కాలంలో.. ద‌య‌లేని పాలకుల పాల‌న‌లో.. ఆదాయం లేని ప‌ర‌మ ద‌రిద్ర స‌మ‌యంలో.. డొల్ల హామీలు, ఉచితానుచిత ప‌థ‌కాల పంప‌క అమ‌లులో పైస‌ల్లేక గిల‌గిలా గిజాగిజా గింజుకుంటున్న సంద‌ర్భంలో… పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గించి ఈ నీచ నీకృష్ట మాన‌వ‌మాత్రుణ్ని కాపాడాల‌నే, ర‌క్షించాల‌నే పాప‌పు ఆలోచ‌న ఏ నాయ‌కుడికైనా వ‌స్తుందా? ఒక్క‌సారి గుండె మీద చేయేసుకుని ఆలోచించండి. గుండె ద‌డ‌ద‌డ ఎక్కువ‌గా ఉందా? అయితే గుండె దిట‌వు చేసుకుని .. లాజిక‌ల్‌గా ఆలోచించండి. ఇది సాధ్య‌మేనా? ప్ర‌జ‌ల‌కు ఇంత‌లా మేలుచేయాల‌నే ఆలోచ‌న ఇప్పుడున్న నాయ‌కుల‌కుందా? స‌రే ఇప్పుడున్న కాకున్నా.. ఎప్పుడైనా ఉన్న నాయ‌కుల‌కు ఉందా? ఉంటుందా? మ‌నం ఎంత పిచ్చివాళ్లం. వాళ్లేదో చేస్తామంటారు. అది ఏమీ కాక‌ముందే మ‌న‌మే ఊహాలోకంలో విహ‌రిస్తాం. దాన్ని అనుభూతి అనుభ‌వించి … మ‌ధురానుభూతి పొంది వ‌చ్చేస్తాం. అంతే. దానికి అతీగ‌తీ ఉండ‌దు.

పెద్ద నోట్ల ర‌ద్దు.. అంటే అదీ మ‌న‌కోస‌మే అనుకుంటాం. క‌ష్టాల కోర్చినా త‌ర్వాత క‌రోడ్‌ప‌తులై పోతామ‌ని క‌చ్చ‌గా క‌ల‌లు కంటాం. ఏదో ప‌థకం వ‌స్తే మ‌న‌మంతా ఉద్ద‌రించేస్తాం అనుకుంటాం. ఇక ఎమ‌న ద‌రిద్రం పోయింద‌నుకుంటాం. అమీర‌లైపోతున్నామ‌ని అప్ప‌టి మ‌టుకు అలా రిచ్‌గా బ‌తికి రాత్రికి మాత్రం గంజితాగి స‌గం క‌డుపుతో డొక్క‌లో కాళ్లుత‌న్నిపెట్టి ప‌డుకుంటాం.

ఇలా నాయ‌కులు మాట‌లు చెబుతూనే ఉంటారు. మ‌నం వాళ్ల‌ను న‌మ్ముతూనే ఉండాలి. అంత‌కు మించి కూడా మ‌నం ఏమీ చేయ‌లేం. వాళ్లేదో చేస్తార‌నే ఊహ‌ల‌,భ్ర‌మ‌ల లోకంలో భారంగా బ‌తుకులీడుస్తూ బ‌తుకాలె అంతే.

పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గుతాయ‌నీ అనుకోవాలి అంతే…

You missed