మద్దికుంట… అప్పట్లో పీపుల్స్ వార్ (ఇప్పటి మావోయిస్ట్ పార్టీ) నక్సల్స్ సమాంతర పాలన సాగించి విముక్తి గ్రామంగా ప్రకటించుకున్నారు. అప్పుడు మాచారెడ్డి మండలం లో ఉండేది. ఇపుడు కొత్తగా ఏర్పడిన రామారెడ్డి మండలంలోకి వెళ్ళింది.
మద్దికుంట గ్రామం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నక్సలైట్ ఉద్యమానికి కేంద్ర బిందువుగా కొనసాగింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు మద్దికుంట ఎన్నో కార్యక్రమాలకు వేదికైంది. అక్కడ ప్రతీ విషయం ప్రజలతో చర్చించి నిర్ణయాలు తీసుకునేవారు. గ్రామ రాజ్య కమిటీ కీలకంగా ఉండేది. ఇపుడు దండకారణ్యం లో నడుస్తున్న జనతన సర్కార్ పాలన అప్పట్లోనే మద్దికుంట లో నడిచింది. ఉమ్మడి వ్యవసాయం, గ్రామ అభివృద్ది, ఉపాధి కల్పించడం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు.. ఇలా ఎన్నో అప్పుడు అమలు చేశారు. అలాగే నక్సలైట్ పార్టీలో సాధారణ దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ సభ్యుని దాకా ఎంతో మందికి మద్దికుంట గ్రామం ఆశ్రయం ఇచ్చింది.
రావిచెట్టు కింద హనుమాన్ ఆలయమే ప్రజా కోర్టు వేదిక….
అక్కడ మంచి అయినా, చెడు అయినా గ్రామంలో రావి చెట్టు కింద ఉన్న హనుమాన్ ఆలయం గద్దె నే వేదికగా కొనసాగేది. నక్సలైట్లు గ్రామస్తులతో ఏ సమావేశం అయినా అక్కడే నిర్వహించేవారు. ప్రజా కోర్టులు కూడా అక్కడే. రెండు దశాబ్దాల కాలంలో ఆ వేదికగా వందల సమావేశాలు జరిగి ఉంటాయి. వివిధ అంశాలపై నిర్వహించిన సభలు, ప్రజా కోర్టులకు సంబంధించిన వార్త కవరేజీ కోసం నేను అక్కడికి ఎన్నో సార్లు వెళ్ళాను. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు జన్మభూమి గ్రామసభ ఏర్పాటు చేశారు. అక్కడికి నక్సల్స్ వచ్చారు. అప్పటి అధికారుల ను ఒక్కొక్కరిని వారి అవినీతిపై నిలదీశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం ఏ ఊరు రైతుల దగ్గర ఎంత డబ్బు తీసుకున్నది ఏ ఈ తో చెప్పించారు.

భూముల కు సంబందించిన వ్యవహారాల్లో అప్పటి తహశీల్దార్, అలాగే ఎంపీడీఓ, ఇతర అధికారులను వరుస బెట్టి నిలదీశారు. అనంతరం అధికారులు వచ్చిన వాహనాలను తీసుకెళ్ళి రెడ్డి పేట చెరువు వద్ద దహనం చేశారు. ఆరోజు నేను రాసిన వార్త బ్యానర్ గా హైలెట్ అయ్యింది. మొన్న ఊళ్లు తిరుగుతూ మద్దికుంట కు చేరుకున్న. ఎన్నో సభలకు, ప్రజా కోర్టులకు వేదికైన హనుమాన్ గుడి వద్ద కొద్ది సేపు నిల్చొని పాత జ్ఞాపకాలు నెమరువేసుకున్న.

– వేణు గోపాల్ చారి, సాక్షి, జర్నలిస్ట్