తెలంగాణ వడ్లు కొనే వరకు కేంద్రంలోని బీజేపీని,రాష్ట్ర బీజేపీ నాయకుల్ని ఎక్కడికక్కడ నిలదీస్తాం
కేంద్రానికి తెలంగాణ రైతుల ఉసురు తప్పక తగులుతుంది
-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ (వేల్పూర్):
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు తెలంగాణ లో పండిన వరి ధాన్యం సేకరణ లో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యపు ధోరణికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రైతులు,నిరసన కార్యక్రమం నిర్వహించారు.అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పెద్ద ఎత్తున రైతులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని పూర్తిగా కొనాల్సిందే అని ఈ సందర్భంగా రైతులు నినాదాలు చేశారు.వివిధ సందర్భాల్లో వరి వేయమని బిజెపి నాయకులు రైతులను రెచ్చగొట్టిన వీడియోలను మంత్రి వేముల నిరసన సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ మీద ప్రదర్శించి చూపించారు. రైతులు,టిఆర్ఎస్ శ్రేణులు వీడియోలు ఆసక్తిగా చూసి, బీజేపీ నాయకులను వదిలే ప్రసక్తే లేదని నినాదాలు చేశారు.బీజేపీ నాయకుల ఇండ్ల ముందు ధాన్యం పారబోస్తానని శపధాలు చేశారు.
అనంతరం నిరసన కార్యక్రమ సభాస్థలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పెద్ద సంఖ్యలో హాజరైన రైతులు,టిఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.

తెలంగాణ మీద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి మండిపడ్డారు.కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పచ్చబడితే వాళ్లు ఓర్వలేకపోతున్నారన్నారు.తెలంగాణ రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్లు,24 గంటల ఉచిత కరెంట్,పెట్టుబడి సాయం,రైతు భీమా లాంటివి అందిస్తుంటే వారికి రాజకీయంగా పుట్టగతులు ఉండవని కేసీఆర్ కాళ్ళలో కట్టెలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీ వి అన్ని అబద్దాలే అన్నారు.కరెంట్ కోసం 10 వేల కోట్లు,రైతు బంధు కోసం 14వేల కోట్లు, రైతు భీమా కోసం 3700 కోట్లు ఏడాదికి ఖర్చు చేస్తున్నారని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ అమలు చేసే రైతు సంక్షేమ కార్యక్రమాలు లేవని అన్నారు.వాళ్ల రాష్ట్రాల్లో ప్రజలు నిలదీస్తున్నారన్నారు.కేసీఆర్ వల్ల తెలంగాణ లో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగిందన్నారు.తెలంగాణ రైతులు ఆర్థికంగా బాగుపడాలని ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు.రెండేళ్లుగా కేంద్రంలోని మోడీ బీజేపీ తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనేందుకు ఆటంకాలు సృష్టిస్తోందన్నారు.

తెలంగాణ ధాన్యాన్ని కొనాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ని మా మంత్రుల బృందం కలిస్తే వడ్లు కొనమని తెగేసి చెప్పారన్నారు.పైగా తెలంగాణ ప్రజలు నూకలు తినాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అవమానించేలా మాట్లాడారని,ఆ వ్యాఖ్యలు బాధను కలిగించాయన్నారు.మమ్మల్ని వంద అన్న పడతాం మా తెలంగాణ సమాజాన్ని అంటే అస్సలు ఊర్కోమన్నారు.ఇక్కడి బీజేపీ నాయకులు సిగ్గు లేకుండా ఢిల్లీ బీజేపీ సంకలో చేరి వారి మాటలకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే ఇవ్వలేం అని సోనియాగాంధీ అన్నందుకే అప్పుడు యుపిఏ ప్రభుత్వం లో కేసీఆర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తు చేసారు.తెలంగాణ ప్రజల కోసం అక్కరకు రాని ఈ పదవి అనవసరమని కేసీఆర్ వెంట్రుకతో సమానంగా విసిరి కొట్టాడన్నారు.అది తెలంగాణ పౌరుషం అని అన్నారు. కానీ..కేంద్రమంత్రి కండ కావరంతో తెలంగాణ ప్రజలు నూకలు తినాలని అవమానిస్తే ఇక్కడి బీజేపీ నాయకుల సప్పుడు లేదని ఎద్దేవా చేశారు.తెలంగాణ రైతులను రెచ్చగొట్టి వరి వేయించిన బండి సంజయ్,కిషన్ రెడ్డి ఎక్కడా..అని ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచైనా తెలంగాణ ధాన్యం కొనిపిస్తామని తెలిపారు.తెలంగాణ వడ్లు కొనే వరకు కేంద్రంలోని బీజేపీని,రాష్ట్ర బీజేపీ నాయకుల్ని ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,రైతు నాయకులు, టిఆర్ఎస్ నాయకులు,పలువురు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
