(దండుగుల శ్రీనివాస్)
చెప్పేందుకు సబ్జెక్టు లేనప్పుడు, చేసేందుకు సరిపడా పనులు లేనప్పుడు, చేయాలన్నా పరిస్థితులు అనుకూలించనప్పుడు.. చేసేవి రాజకీయ ఆరోపణలే. అవి ఇప్పుడు శృతి మించాయి. వ్యక్తిగత ఆరోపణలకు కొదవ లేదు. వ్యక్తిత్వ హననాలకు దిగజారడానికీ వెనుకడాటం లేదు. హీరోయిన్లతో రంకులు, డ్రగ్స్‌ను వాడుతున్నావంటూ డీమోరల్ చేసే ఆరోపణలు… వీటితో పాటు నీ పొట్టేంది? నీ బట్టేంది? అనే ఎత్తిపొడుపులు. ఇవన్నీ ఇప్పుడు కామన్ అయిపోయాయి రాజకీయాల్లో. అవును.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇవి మరీ శృతి మించిపోయాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు చేసిన ఘాటు ఆరోపణలు, పచ్చి బూతులు జనాలకు కొందరికి వీనులకు విందుగానే అనిపించవచ్చు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పచ్చి బూతులు మరింత పదునెక్కాయి. లాగుల్లో తొండలిడుస్తా అనే కాడికి వచ్చింది కథ. ఇక అప్పటి షాడో సీఎం, ఇప్పటి ప్రతిపక్ష నేత ఏమన్నా తగ్గుతుండా..?
అరే పొట్టొడా.. రారా పోరా మాటమీదకెళ్లి దిగుతలేడు. జనం విస్తుపోతున్నారు. చీదరించుకుంటున్నారు. అసహ్యించుకుంటున్నారు. కానీ ఈ నేతలు మారడం లేదు. ఒకరిపై మరొకరు గోతులు తీసుకునేక్రమంలో నీతులు వల్లెవేస్తూనే బూతులను వదలడం లేదు. జనానికి అంతిమంగా మేలు జరిగే బదులు.. అన్యాయమే జరుగుతున్నది. సరైన పాలకుడు లేనప్పుడు, నిగ్గదీసే ప్రతిపక్షం నీరసించి పక్కదారులు పడుతున్నప్పుడు అడిగేవాడెవ్వడు? పట్టించుకునేవాడెవ్వడు.? పాలకుడికి భయం ఎందుకుంటుంది? పరిపాలనలో ప్రజల అంశం దూరమై.. అధికారమే పరమావధిగా సాగే రాజకీయాలే ప్రధానమవుతాయి. ఇప్పుడవే జరుగుతున్నాయి. ఎవరూ తగ్గేదెలే అంటున్నారు. డ్రగ్స్ పరీక్షలు చేపించుకుందామా? అనే కాడికి పోయారు ప్రజాప్రతినిధులు. సమాజానికి ఏం సందేశానిస్తున్నారో గానీ, దేశ రాజకీయాల్లో తెలంగాణను మాత్రం ఎప్పుడు వార్తల్లో కేంద్రబిందువును చేస్తున్నారిద్దరు. అదే ఆ రెండు పార్టీలు.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
