(దండుగుల శ్రీనివాస్)
ఇచ్చినోళ్లకే మళ్లీ మళ్లీ సీట్లు. సిట్టింగులకే అందలం. మీరే హీరోలు. మీరేం చేసినా ఓకే. మాకు, జనాలకు మీరే సుప్రీంలు.. అబ్బబ్బా ఏం పంపుకొట్టాడు కేసీఆర్. ఎంతైనా ఆయన సెలెక్టు చేసిన బ్యాచ్ ఆయే! జనాలకు ఆయన ఏది చెబితే అదన్నమాట. అందుకే అక్కడ కుక్కను పెట్టిన, కేసీఆర్ చెప్పును పెట్టినా జనాలు గెలిపించేస్తారు.. అని గేలిగా చూశాడు. హేళనైపోయాడు చివరకు. ఇప్పుడు చెప్పొచ్చే విషయం ఏంటంటే.. పైలట్ రోహిత్‌రెడ్డిని హీరో చేశాడు కేసీఆర్. ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంలో అపర నీతిమంతుల జాబితాలో వారిని ఎక్కించి.. ఇగో సూసిర్రా.. ఇసొంటి లీడర్లబ్బా కావాల్సింది మనకు…అని జబ్బలు చర్చుకున్నాడు. ఆ నలుగురి సచ్చీలత జనానికి తెలియనట్టు. ఆయన భుజకీర్తులు ఎత్తగానే జనం కూడా నమ్మేసినట్టు. ఇదిగో నిజాలు, అసలు రూపాలు ఇలా లేటుగానైనా తేలిపోతాయి. తెలిసిపోతాయి. బయటపడతాయి.
అధికారం పోయి రెండేండ్లైనా పాత వాసనలు, వ్యాపకాలు వదల్లేదంటే, ఆ పదేండ్లలో మీరెన్ని అరాచకాలు చేసుంటుర్ర బై. కేటీఆర్ అండ చూసుకుని, కేసీఆర్‌కు తిరుగులేదనుకుని. అందుకే ఆ పదేండ్ల పాపం ఇలా వెంటాడుతున్నదన్నమాట. కర్మ రిటర్స్న్ అంటారు కదా. అదింకా మిగిలే ఉంది వీరి రూపంలో.
ఇలాంటి పైలట్లు చాలా మందే ఉన్నారు ఇంకా బీఆరెస్ పార్టీలో. అంటే అంతా డ్రగ్స్ తీసుకునేవాళ్లని కాదు నా ఉద్దేశం. ఆ పార్టీ కొంపముంచెటోళ్లు. ఇంకా ఇంకా లోతుల్లోకి పాతరేసేవాళ్లు. ఇప్పుడంటిన మరకలు చాలవని ఇంకా ఇంకా బురద జల్లించెటోళ్లు.. ఉన్నరు. వారిని వదలరు వీళ్లు. వీళ్లను వదలరు వాళ్లు. ఒకరికొకరు తోడుగా ఉన్నారు అప్పట్నుంచి. ఇప్పుడు ఎలా వీరి బంధం చెడుతుంది. చెడదు. ఇంకొకరని చేరదీస్తే కదా కేసీఆర్. ఆయా నియోజకవర్గాల్లో సెకండ్ క్యాడర్ లీడర్ ఎదగడానికి. అంతా వాళ్లకే ఇచ్చే. వాళ్లే అన్నీ అని చెప్పే. ఆ సిట్టింగుల అరాచకాలు తెలిసీ.. మార్చలేని దుస్థితి ఓ వైపు. మార్చాలంటే పార్టీ జంప్ అయితరేమోనని భయం ఇంకోవైపు. వాడిని చూసి కాదు నన్నుచూసి ఓటేస్తరని గుడ్డి నమ్మకం,భ్రమ మరోవైపు. ఇలా అంతా కలిసి కొంపముంచారు. ఇంకా ముంచుతున్నారిలా. ఇప్పుడు ఈ పాపం ఫామ్‌హౌజ్‌లో కూసున్న కేసీఆర్‌కే కాదు.. పెత్తనమెత్తుకుని చెమటోడుస్తున్న కొడుకు కేటీఆర్‌కు తగిలింది. అందుకే ప్రతీదాంట్లో కేటీఆర్ పేరు రానే వస్తుంది. నాకు సంబంధం లేదురా మొర్రో అని మొత్తుకున్నా…. ఆ పేరు గింగిరాలు తిరుగుతుంది.
తిప్పతున్నారు కూడా దొరికింది చాన్సని. ఈ ఫైలట్‌లాంటోళ్లు ఎంత మంది ఉన్నారనే కదా..? మీ డౌటు. ఒక్కరా ఇద్దరా లెక్క చెప్పనీకి. ఒకటా రెండా పాపాలు లెక్కబెట్టనీకి. టైమ్‌తో పాటు అవీ బయటకు వస్తాయి ఇలా. ఫామ్‌హౌజ్ పార్టీల పేరుతో. ఇంకోలా. మరోలా. ఎలాగోలా.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
