(దండుగుల శ్రీ‌నివాస్‌)

ప్ర‌జాపాల‌న అంటు ప్ర‌జాకంఠక చ‌ర్య‌లు చేప‌డితే..!త‌మ‌ను అడిగేవారు లేర‌నే అహంకారాన్ని ప్ర‌ద‌ర్శిస్తే.. !ఇప్ప‌టిదాకా సాగింది.. ఇక‌పైనా సాగుతుంద‌ని వెర్రిమొర్రి మూర్ఖ‌పు చేష్ట‌లు చేస్తే…! కాలం ఎప్పుడూ ఒక‌లా ఉండ‌దు. ప్ర‌శ్నించేవారొస్తారు. బాధిత వర్గం తిర‌గ‌బ‌డుతుంది. అధికారం ఎప్పుడు ఎవ‌రికీ ఇక్క‌డ శాశ్వ‌తం కాదు.. అని ప‌దే ప‌దే చెప్పినా.. పాల‌కులంతా ఒక్క ఆకులో చ‌ద‌విన‌ట్టుగానే ఉన్నార‌ని రూడీ చేసుకుని మ‌రీ తిర‌గ‌బ‌డ‌తారు. అది ఏరికోరి తెచ్చుకున్న ప్ర‌భుత్వ‌మైనా స‌రే. త‌మ జీవితాల‌నే ధ్వంసం చేసే వ్యూహ‌ర‌చ‌న‌లో చేస్తున్న స‌ర్కార్‌కు బాధితు జ‌నం తోడురాగా.. ప్ర‌జానాడి తెలిసిన ప్ర‌జా నాయ‌కులూ ముందుంటారు. అంద‌రూ రాజ‌కీయాలే చేయ‌రు. కొంద‌రు మాత్రం జ‌నం కోసం పోరాడుతారు. జనానికి న్యాయం చేయ‌డం ద్వారా వారిని బ‌లోపేతం చేస్తూ తాము రాజ‌కీయంగా బ‌ల‌ప‌డాల‌నుకుంటారు. అందులో ఇప్పుడు ముందు వ‌రుస‌లో ఉన్న‌ది.. అంద‌రి నోళ్ల‌లో నానుతున్న‌ది తెలంగాణ జాగృతి పేరు. క‌విత పోరాటం.

నిజం చెప్పాలంటే కాంగ్రెస్ స‌ర్కార్‌లో కూల్చివేత‌లు స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయాయి. ఎందుకో తెలియ‌దు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు అమ‌లుచేయ‌లేక‌.. నిధులు లేవ‌నే సాకును ప‌దే ప‌దే చెబుతూ.. గ‌త స‌ర్కార్‌ను దుమ్మెత్తిపోసే, విమ‌ర్శించేందుకు స‌రిపోయింది దాని కాలం. మ‌రి తన పాల‌న‌కు ఓ ముద్ర ఉండొద్దా అని సీఎం ఆలోచిస్తే అది మంచిదే. కానీ అది కూల్చివేత‌ల‌తో స్టార్ట్ చేశాడు చూడు అదే పెద్ద పొర‌పాటు. మాయ‌ని మ‌చ్చ‌. ఇప్పుడు దీన్ని కూల్చివేత‌ల స‌ర్కార్‌గా పిలుచుకుంటున్నారు. ఖ‌మ్మం వెలుగుమ‌ట్ల‌లో కూడా అదే ధైర్యంతో పోయారు. కుప్ప‌కూల్చారు ఇళ్ల‌న్నీ. ఎవరొస్తారు లే. ఏం చేస్తారులే..? అనే బ‌రితెగింపు. కానీ అప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. క‌విత ఎంట్రీతో మ‌రో లెక్క‌గా మారింది అక్క‌డ సీన్‌. మెర‌పు ధ‌ర్నా, నిర‌వ‌ధిక నిరాహార దీక్ష‌.. స‌ర్కార్‌ను గజ్జుమ‌నేలా చేసింది. పెయిడ్ ఆర్టిస్టులు అని అన్న నోరుతోనే వారికి అక్క‌డే ఇళ్ల స్థ‌లాలిచ్చి ఇళ్లు క‌ట్టిచ్చి ఇస్తామ‌నేదాకా తీసుకొచ్చారు త‌మ పోరాటం ద్వారా క‌విత‌.

స‌ర్కార్ ఏర్ప‌డిన రెండేళ్ల త‌రువాత జ‌రిగిన పోరాటాల్లో ఇంత‌లా స‌ర్కార్‌ను వెంటాడి, వేటాడిన సంద‌ర్భం ఇదే. భూదాన్ భూముల‌పై స‌ర్కార్ క‌న్ను ప‌డింది. ఖ‌మ్మంతో మొద‌లుపెట్టి రాష్ట్రంలోని అన్నింటినీ మాయం చేసే ప‌న్నాగంలో ఇదో ట్ర‌య‌ల్ ర‌న్ .. క‌విత అన్న‌ట్టుగా. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు విఫ‌ల‌మైన వేళ‌.. జాగృతి ఆ శూన్య‌త‌ను భ‌ర్తీ చేసిన‌ట్టే అనుకోవాలె. ఆమె వెనుక ఉన్న‌ది గుప్పెడు మందే కావొచ్చు. కానీ ఆమె వ్యూహం ఎవ‌రికీ అంద‌నిది. ఆమె ధైర్యం పోరాటాల‌కు ఊతంగా ఉంటున్న‌ది. మొండి ప‌ట్టుద‌ల న్యాయం జ‌రిగే వ‌ర‌కు ముందుకు తీసుకెళ్తున్న‌ది. విష‌య ప‌రిజ్ఞానం జనాన్నీ చైత‌న్యం చేస్తున్న‌ది. అందుకే స‌ర్కార్ మెడ‌లు వంచ‌గ‌లిగింది దీక్ష‌. పేద‌ల ప‌క్షాన మేమున్నామ‌ని చెప్ప‌గ‌లిగింది ఖ‌మ్మం ఐక్య‌పోరాటం. ఫ‌లితం సంపూర్ణం కాలేక‌పోవ‌చ్చు. న్యాయం పూర్తిగా జ‌ర‌గ‌దు కావొచ్చు. కానీ స‌ర్కార్‌కు ఓ చెంపపెట్టులాంటి స‌మాధానం. పాల‌కుల‌కు గుణ‌పాఠం నేర్పిన వైనం ఇప్పుడు రాష్ట్రానికే ఖ‌మ్మం ఐకాన్‌గానిలిచింది.