(దండుగుల శ్రీనివాస్)
ఎంకన్న సాక్షిగా కేసీఆర్ పాలనను ఎండగట్టిన కవిత! ఇలా చెప్పడం కొంచెం స్మూత్‌గా అనిపిస్తున్నట్టుంది. ఇంకా సూటిగా…కటువుగా చెప్పాలంటే..ఎంకన్న సాక్షిగా కేసీఆర్ పాపాలను ఎండగట్టిన కవిత! అనాలేమో. శ్రీవారి చెంతకు మొక్కు తీర్చుకునేందుకు వెళ్లిన ఆమె.. బీఆరెస్ చేసిన తప్పిదాలను ఎత్తి చూపడమే కాదు.. విస్మరించిన వర్గాలను గురించి గుర్తు చేశారు. తాను అలా చేయబోనని ఆమె పరోక్షంగా చెబుతూనే.. ఎవరినైతే కేసీఆర్ విస్మరించాడో.. ఆ వర్గాలను చేరదీస్తానని చెప్పారామె. వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని ఏడుకొండల వాడి సాక్షిగా హామీ ఇచ్చారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని కలలుగన్న వారి ఆకాంక్షలకనుగుణంగా నడుచుకుంటానని చెప్పుకొచ్చారామె. వారి అభీష్టాలు, ఎజెండానే తమ కొత్త పార్టీ జెండా కానుందని కూడా ప్రకటించారు తిరుమల తిరుపతి వేదికగా. వెంకన్న దేవుడి సాక్షిగా.
ఆమె తిరుమల కొండపై మీడియాతో మాట్లాడింది కొద్దిసేపే. అదీ విలేకరులు అడిగిన ప్రశ్నలకే ఆమె పొడిపొడిగా.. సూటిగా, సుత్తి లేకుండా సమాధానాలిచ్చారు. రాజకీయాల కోసం ఆమె మాట్లాడినట్టు అనిపించలేదు. లేనిపోనివి ఆపాదించి అబద్దాలు చెప్పినట్టు ఎవరూ భావించరు. ఎందుకంటే అది పవిత్రమైన తిరుమల కొండ. ఆమె మొక్కు తీర్చుకునేందుకు వచ్చారు. తప్పుడు లిక్కర్ కేసు పెట్టి నాలుగేండ్లు తనను, తనను నమ్ముకున్నవారిని, వెంట నడిచిన వారిని మానసిక క్షోభకు గురిచేసిన వైనాన్నీ వివరించారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల ఏడు కొండల వాసుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆమె తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. మనోవేదనను పంచుకున్నారు. భవిష్యత్ ఆకాంక్షలను వివరించారు. తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు రెండూ ఫెయిల్ అయిపోయాయని చెప్పిన ఆమె.. సర్కార్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందన్నారు. అయినా మొన్నటి మున్సిపాలిటీలో ఎక్కువ స్థానాలు అధికార పార్టీకే రావడం.. ఈ ప్రతిపక్షాల పసలేని పనితనం వల్లేనని, జనాలు వీరిని నమ్మకపోవడం కారణమని కూడా చెప్పారు. అధికార పార్టీపై ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత జనం మనసులో గూడుకట్టుకుని ఉన్నా.. ప్రత్యామ్నాయం లేక మిన్నకుండిపోతున్నారని అర్థం వచ్చేలా మాట్లాడిన కవిత… ఆల్టర్నేట్ శక్తిగా తమ పార్టీ వైపు జనం ఆసక్తిగా చూస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు.
పూటకో మాట మాట్లాడి, ఒక్క స్టాండ్‌పై నిలబడని ప్రతిపక్షాల తీరును ఎత్తిపొడుస్తూనే.. గత పదేళ్ల పాలన పాపాల పాయింట్‌ను ఆమె సుత్తిమెత్తగా టచ్ చేసి వదిలారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, యువత, మహిళలు.. ఈ వర్గాలను కేసీఆర్ పూర్తిగా విస్మరించారనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తమ పార్టీ సబ్బండవర్ణాల సంక్షేమం కోసం ఉద్భవించే పార్టీనని, భేదభావాలు లేకుండా తెలంగాణ ప్రజల హక్కులను పరిరక్షించే రక్షణ కవచంలా తమ పార్టీ ఉండబోతున్నదని ఆమె వివరించారు. రెండు నెలల్లోనే పార్టీ ఆవిర్భావం ఉంటుందని ప్రకటించిన ఆమె.. మళ్లీ మళ్లీ ఏడుకొండల వాడి దర్శనానికి వస్తామని, ఆయన దయతో ఇప్పటికే తనపై పెట్టిన తప్పుడు కేసు సంపూర్ణంగా కొట్టివేయబడిందని చెప్పిన ఆమె… తన కొత్త పార్టీ… ఆకాంక్షలు, పాలసీలు.. అన్నీ నీతి, నిజాయితీతో అమలు జరుగుతాయని ఏడుకొండల వాడి సాక్షిగా ప్రకటించారు.
Dandugula Srinivas
Senior Journalist
7661066999

