వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్:
మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించానని, ఈ ఫలితాలతో విర్రవీగనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నా రెండేండ్ల పాలనలో జనానికి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నానని, చేస్తున్న పనులు కూడా ఫలితాలనిస్తున్నాయని చెప్పారు. సంత్ సేవాలాల్ జయంతి సభలో ఆయన మాట్లాడారు. నేనే రాజు,నేనే మంత్రి అని అన్నమాట వాస్తవమేనని, నేను సీఎంగా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఎన్నికల ఫలితాలకు బాధ్యత నాదే అని అర్థం వచ్చేలా ఆ మాటలన్నానని వివరణ ఇచ్చుకున్నారాయన. ప్రజలకు ఎంతకాలం ఆశీర్వదిస్తే అంతకాలం తానే సీఎంగా ఉంటానని అన్న ఆయన.. మరో 20 ఏండ్లు జనం కోసమే పనిచేస్తానని పరోక్షంగా ఇరవై ఏళ్ల వరకు తానే సీఎంనని చెప్పుకొచ్చారు.
ఫలితాలు ఎలా వచ్చిన స్వీకరిస్తానని, జనం తీర్పును గౌరవిస్తానని అన్నారు. కానీ పదేళ్లు పాలించిన బీఆరెస్ ప్రజా తీర్పునే తప్పుబడుతున్నదన్నారు. వాళ్లకు ఓటేస్తేనే జనం మంచోళ్లన్నట్టుగా మాట్లాడుతున్నారని, లేదంటే జనం తీర్పునే తప్పుబట్టేలా వారి మాటలుంటున్నాయని దుయ్యబట్టారు. కేసీఆర్,కేటీఆర్ ఇంకా మారలేదన్నారు. నేను పాలకుడిలా కాకుండా సేవకుడిలా జనం వద్ద మెప్పు పొందేందుకు పనిచేస్తున్నానని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు దగ్గరవుతున్నానన్నారు.
తనకు ఇంత మంచి అవకాశాన్నిచ్చిన ప్రజలను విస్మరించే పరిస్థితే లేదని, మరో 20 ఏండ్లు వారికోసమే పనిచేస్తానని అన్నారు. ఏ దళితుడినైతే ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేశాడో.. ఆ దళితుడిని అధ్యక్షా అని మైక్ అడిగే పరిస్థితి తీసుకువచ్చానన్నారు. దళితుడు రాష్ట్రాన్ని నడపలేరు..నేనైతేనే నడుపుతా అన్న వాళ్ల అధ్యక్షా అని పిలిచి మైక్ అడిగేలా దళితుడిని పైన కూర్చోబెట్టినా అని అన్నారు. మీరు ఆశీర్వదించినంత కాలం ఉంటానని, పరిణామ క్రమంలో ఇతరులు రావాల్సిందేనన్నారు.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
