(దండుగుల శ్రీ‌నివాస్)

ఇంత‌కు ముందే చెప్పుకున్నాం. ఇంత బ‌తుకు బ‌తికి ఇంటెన‌కాల చ‌చ్చిన‌ట్టు ..అని. దేశాన్ని ఏలాల్సినోడు. తృటిలో త‌ప్పింది అదృష్టం. లేక‌పోతే దేశ్‌కీ నేతనే అయ్యేవాడు. కాలం ఎంత మ‌హ‌త్త‌ర‌మైంది. ఏదైనా చేయ‌గ‌ల‌దు. ఎక్క‌డికైనా తీసుకుపోగ‌ల‌దు. ఏమైనా చేసేయ‌గ‌ల‌దు. కల‌లో కూడా కేసీఆర్ అనుకొని ఉండ‌డు. త‌న‌కీ ప‌రిస్థితి వ‌స్తుంద‌ని. అదీ ఫోన్ ట్యాపింగ్ కేసులో త‌న‌ను నాలుగు గంట‌ల‌కు పైగా విచారించ‌డం. హ‌వ్వా..! అది జాతికే అవమానం. ఇది నేనంటున్న‌ది కాదు. బీఆరెస్ శ్రేణులు అంటున్న‌ది. ఆ నినాదం వారికే అంకితం. కానీ ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చి విక్ట‌రీ సింబ‌ల్ చూపిస్తూ.. త‌న అభిమానుల‌కు దండం పెడుతున్నప్పుడు ఎందుకో ఆయ‌న ముఖం చూసి మ‌న‌సు చివుక్కుమ‌న్న‌ది.

ఆ ముఖంలో జీవ‌క‌ళ లేదు. నీర‌సంగా క‌నిపించిన కళ్లు. క‌ళ‌లేని ముఖం. ఏదో భ‌రించ‌ని అవమానం త‌న‌లో గుప్తంగా దాచుకుని పైకి గంభీరంగా క‌నిపించేందుకు ఆయ‌న విఫ‌ల‌య‌త్న‌మే చేశాడు. ఓపిగ్గా ప‌ట్టుమ‌ని రెండు నిమిషాలు కూడా అక్క‌డ నిల‌బ‌డ‌లేక‌పోయాడు. వెంట‌నే గిర్రున వెనుదిరిగాడు. ఇక మీడియాలో చాలా క‌థ‌నాలే వ‌చ్చాయి. ఎమ్మెల్యేల కొనుగోలు విష‌యం ఎలా తెలిసింది. అధికారుల నియామ‌కం..? పెద్దాసారంటే మీరేనా? సుప్రీం ఫోన్ ట్యాపింగ్ చేయ‌మ‌న్నాడు.. మీరేనా సుప్రీం అంటే.. అని ఏవేవో క‌థ‌నాలు మీడియాలో వ‌చ్చాయి. ఎవ‌రికి దొరికిన సోర్స్ వాళ్లు రాసుకున్నారు. కానీ ఒక్క‌టి మాత్రం నిజం. ఈ విచార‌ణ‌తో కేసీఆర్ ఇజ్జ‌త్ క‌చ‌రా అయితే అయ్యింది.

అవును. కాళేశ్వ‌రంలో అవినీతి జ‌రిగింది అన్నా.. ఏదో మంచి చేద్దామ‌నుకుని మంచి ప్ర‌య‌త్న‌మే చేశాడు కానీ.. అవినీతి వ‌ల్ల అలా జ‌రిగిందేమో.. కానీ అంతిమంగా జ‌నం మేలు అందులో దాగుంది క‌దా అని స‌ర్ది చెప్పుకున్నారు చాలా మంది. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ‌ల్ల ఎవ‌రికి లాభం. మ‌ళ్లీ మ‌ళ్లీ అధికారం మాకే రావాలి.మేమే అధికారంలో ఉండాలి. ఎవ‌రినీ రానీయ‌ద్దు. ఎద‌గ‌నీయొద్దు. పాలించ‌నీయొద్దు. అధికారంలోకి రానీయొద్దు… ఇవే ల‌క్ష్యాలు గ‌దా వాటి వెనుక‌. వీటినీ స‌మ‌ర్థించే బానిస‌లున్నారు. ఏమ‌నంటే.. అవును ఆయ‌నే తెలంగాణ తెచ్చాడు. ఆయ‌నే ఉండాలి. ఆయ‌నే ఉంటాడు. ఆయ‌న కాక‌పోతే కొడుకు. కొడుకు కాక‌పోతే మ‌న‌వడు. త‌ప్పేం ఉంది. అస‌లు కేసీఆర్ ఏది ఆలోచిస్తే అది తెలంగాణ కోసమే. తెలంగాణ బాగు కోస‌మే. బంగారు తెలంగాణ కోస‌మే. అరేయ్ ఆపండ్రా.. ఇక‌నైనా. మారండ్రా మారండి.

Dandugula Srinivas

Senior Journalist

7661066999