(దండుగుల శ్రీ‌నివాస్)

చాలా చాలా రోజుల త‌రువాత సీఎం రేవంత్‌రెడ్డి త‌న విశ్వ‌రూపాన్ని చూపారు. జూబ్లీహిల్స్ పోలింగ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఇక్క‌డి రాజ‌కీయం హీటెక్కుతున్న‌ది. ఒక‌రికి మించి మ‌రొక‌రు వాడివేడి ప్ర‌సంగాలు చేసుకుంటున్నారు. ఇవాళ కేటీఆర్‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు సీఎం. ప‌నిలో ప‌ని కేటీఆర్‌, కిష‌న్‌రెడ్డిల‌ను ఇద్ద‌రినీ మ‌డ‌త‌పెట్టేశారు. వీరిద్ద‌రినీ బ్యాడ్ బ్ర‌ద‌ర్స్ అని సంబోధించిన సీఎం.. బీఆరెస్‌, బీజేపీ పార్టీల అక్ర‌మ క‌ల‌యిక‌, తెర‌వెనుక ఒప్పందాలు, జ‌నాల చెవిలో పువ్వులు పెడుతూ ఈ రెండూ ఎలా దాగుడు మూత‌లు ఆడుతున్నాయో… అన్నీ వివ‌రించారు. జ‌నం ముందు ఈ రెండు పార్టీల‌ను బ‌రిబాత‌ల నిల‌బెట్టినంత ప‌నిచేశారు రేవంత్‌.

ఈ ప‌దేండ్ల కాలంలో బీఆరెస్ పాల‌న‌లో జ‌నాల‌కు ఏం ఒరిగిందో చెప్పాల‌ను ఆయ‌న సూటిగా ప్ర‌శ్నించారు. స‌చివాల‌యం, క‌మాండ్ కంట్రోల్ భ‌వ‌నం, ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ల‌కు నిర్మించిన కేసీఆర్ వీటి వ‌ల్ల ఒక్క‌రిక‌న్నా ఉద్యోగం, ఉపాధి క‌ల్పించ‌గ‌లిగారా? అని నిలదీశారు. కాళశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టి ల‌క్ష కోట్లు అవినీతి చేశార‌ని, సీబీఐకి దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ చేసి కేసులు క‌ట్టి శిక్షించాల‌ని కోరితే.. కేంద్రం కేసీఆర్, కేటీఆర్‌, హ‌రీశ్‌ల‌పై ఈగ కూడా వాల‌నివ్వ‌కుండా కాపాడుకుంటుంద‌న్న‌ద‌ని దీనిపై కిష‌న్‌రెడ్డి స‌మాధానం చెప్పాల‌ని ప్ర‌శ్నించారు సీఎం. కాళేశ్వ‌రం అవినీతి విష‌యంలో గ‌తంలో కిష‌న్‌రెడ్డి.. సీబీఐకి ఇస్తే వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పి.. ఇప్పుడెందుకు వెనుక‌డుగు వేస్తున్నార‌ని నిల‌దీశారు.

మోడీతో కేసీఆర్‌కు ఒప్పందాలు ఉన్నాయ‌ని, ఈ రెండు పార్టీలు వేర్వేరు కాద‌ని, ఒక‌టే రూప‌మ‌ని అని పున‌రుద్ఘాటించారు. కిష‌న్‌రెడ్డి కేంద్రం నుంచి న‌యా పైసా తీసుకురాలేక‌పోయాడ‌ని, న‌గ‌రాన్ని అభివృద్ది చేసే విష‌యంలో బీజేపీ జీరోన‌న్న సీఎం.. కేటీఆర్‌తో కలిసి త‌న‌ను న‌గ‌రాభివృద్ది చేయ‌కుండా అడ్డుకుంటున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. పాల‌కు పాలు.. నీళ్ల‌కు నీళ్లు.. ఖుల్లం ఖుల్లాగా చాలా అంశాల‌పై లోతుగా, విష‌యానుసారంగా అన‌ర్గ‌ళంగా మాట్లాడారు సీఎం. గంజాయి, డ్ర‌గ్స్‌ను హైద‌రాబాద్‌లో పెంచి పోషించిందే కేటీఆర్ అని అన్నారు. అక్ర‌మంగా సంపాదించిన సొమ్ములో చెల్లెకు వాటా ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని బ‌య‌ట‌కు పంపార‌ని, కేటీఆర్‌ను పిచ్చోడిని చేసి హ‌రీశ్ ఆడుకుంటున్నాడ‌ని, పార్టీ మొత్తాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు రెడీ అవుతున్నాడ‌ని రేవంత్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతిమంగా జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ రాద‌ని, బీఆరెస్‌కు చిత్తుగా ఓడిపోబోతుంద‌ని కూడా తేల్చి చెప్పేశారు.

ఈ రెండేళ్ల కాలంలో న‌గ‌రానికి తాను సీఎంగా ఉండి ఏమేమీ అభివృద్ది ప‌నులు చేసింది ఏక‌రువు పెట్టిన రేవంత్‌.. త‌న‌కు జూబ్లీహిల్స్ ఓట‌ర్లు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని, బ‌ల‌ప‌ర్చాల‌ని, ప‌దేండ్ల పాటు అవ‌కాశం ఇస్తే ఇంకా చాలా చేసి చూపిస్తాన‌ని రేవంత్ విజ్ఞ‌ప్తి చేశారు.