(దండుగుల శ్రీనివాస్)
ఎవడి గోల వాడిదే. ఓ వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న తరుణంలో హోరాహోరీగా ప్రచారం జరుగుతుంటే.. కవిత మాత్రం జనం బాట పేరుతో తెలంగాణలోని పల్లెలు చుట్టి వస్తోంది. పనిలో పనిగా మధ్యలో ఆమె బీఆరెస్‌పై అస్త్రాలకు ఎక్కు పెడుతోంది. మొన్న కాళేశ్వరంలో అవినీతి నిజమేనని, దీనికి మూలం అంతా హరీశ్, సంతోష్‌లేనని ఆమె కుండబద్దలు కొట్టింది. పార్టీ నుంచి గెంటేయబడింది. ఇప్పుడు ఈ జనం బాట ద్వారా మరింత ఘాటుగానే బీఆరెస్‌పై అస్త్ర శస్త్రాలు ప్రయోగిస్తున్నదామె. తనను పార్టీ నుంచి వెళ్లగొట్టే విషయంలో కేసీఆర్ ప్రమేయం లేకుండా జరగలేదని.. ఆమె తన తండ్రిని కూడా దోషిగా నిలిపే ప్రయత్నం చేసింది. ఇప్పుడు తాజాగా ఆమె మళ్లీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటకు తీసింది. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిన అంశాన్ని తన మాటల ద్వారా ధ్రువీకరించింది. తన భర్త.. కేటీఆర్‌కు సొంత బావ అని కూడా చూడకుండా ఫోన్ ట్యాప్ చేశాడని ఆమె ఘాటుగా విమర్శించింది.
ఈ విషయం తెలుసుకున్న తరువాత కేటీఆర్‌పై తనకు ఏవగింపు కలిగి.. కడుపులో దేవినట్టైందని కూడా అన్నదామె. ఇప్పుడు ఇది రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ మెడపై కత్తి వేలాడుతోంది. ఈ కేసు పురోగతిలో ఉండగానే కవిత.. స్వయంగా తన భర్త ఫోన్‌నే కేటీఆర్ ట్యాపింగ్ చేశాడని చెప్పుకోవడం.. బీఆరెస్ శిబిరంలో కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ క కాంగ్రెస్ దీన్ని అస్త్రంగా వాడుకోనుంది. మరోవైపు తను కొత్త పార్టీ పెట్టబోయే అంశాన్ని ఆమె రోజు రోజుకూ క్లియర్ చేస్తూ వస్తోంది. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంది.. అని గట్టిగా చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా.. అందుకే తాను కొత్త రాజకీయ పార్టీ పెట్టాల్సి వచ్చిందని, దీనికి జనం ఆమోదం కూడా ఉందని ఆమె పరోక్షంగా చెప్పుకుంటూ వస్తున్నది. ఇంకా మున్ముందు జనంబాట కార్యక్రమం కొనసాగనున్న నేపథ్యంలో బీఆరెస్‌పై మరెన్ని మాటల దాడులు చేయనుందోననే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొన్నది.
Dandugula Srinivas
Senior Journalist
7661066999
