(దండుగుల శ్రీ‌నివాస్‌)

గ్రామీణ ప్రాంతాల ఓట‌ర్ల‌తో పోలిస్తే.. ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర ప్రాంతాల ఓట‌ర్ల ఆలోచ‌న‌లు విభిన్నంగా ఉంటాయి. గ‌డిచిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ ఫ‌లితాలే దీనికి నిద‌ర్శ‌నం. రాష్ట్ర‌మంతా ఫ‌లితాలు ఒక‌లాగ ఉంటే.. హైద‌రాబాద్‌లో మాత్రం అప్ప‌టి వ‌ర‌కు బీఆరెస్ చేసిన అభివృద్ధిని చూసి..ఇంకా ఇంకా అభివృద్ధి కోరుకుని ఓట్లేశారు. ఫ‌లితంగా అక్క‌డ బీఆరెస్‌కు ఎక్కువ సీట్లు వ‌చ్చాయి. మ‌రంతే.. న‌గ‌ర ప్ర‌జ‌ల ఆలోచ‌న ఎక్కువ‌గా అభివృద్ది వైపే ఉంటాయి. జీవ‌న ప్ర‌మాణాలు పెంచుకునేందుకు, మంచి నాణ్య‌మైన విద్య దొరుకుతుంద‌నే భావ‌న‌తో … బంగారు భ‌విష్య‌త్తును కోరి వారంతా వల‌స జీవ‌నం ఎంచుకున్నారు. న‌గ‌రాల‌కు, ప‌ట్ట‌ణాల‌కు వ‌స‌ల వ‌చ్చి అక్క‌డే తమ జీవితాల‌ను, జీవ‌న ప్ర‌మాణాల‌ను పెంచుకోవాల‌ని చూస్తారు.

అందుకే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. ఇప్పుడు జ‌రుగుత‌న్న‌ద‌దే. ఇంకా మూడేండ్ల ట‌ర్మ్ కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ఉంది. దీనికి తోడు.. సీఎం రేవంత్ ప‌దే ప‌దే త‌న ప్ర‌సంగాల్లో ఇంకా ఎనిమిదేండ్లు మేమే ఉంటాం.. అనే నినాదాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకుపోగ‌లిగారు. దీంతో ఈ పార్టీకే ఓటు వేయ‌డం ద్వారా త‌మ ప‌ట్ట‌ణం, న‌గ‌రం, కాల‌నీలు మ‌రింత అభివృద్ధికి నోచుకుంటాయ‌నే భావ‌న వారిలో ఉంది. అభ్య‌ర్థులు, లోక‌ల్, నాన్ లోక‌ల్.. అండ‌బ‌లం, కుల‌బ‌లం, ఆర్థిక‌బ‌లం.. ఇవ‌న్నీ ఒకెత్త‌యితే .. ఇదిగో ఇదే ప్ర‌ధానంగా ఓట‌రును ఆలోచింప‌జేసే అంశం. అందుకే ఈ జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌లో కాంగ్రెస్ వైపు ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర ప్ర‌జ‌లు చూస్తున్నారు.

కొన్ని చోట్ల అధికార పార్టీతో బీజేపీ పోటీ ప‌డుతుండ‌గా, కొన్ని మున్సిపాలిటీలో బీఆరెస్ కూడా గట్టిగానే పోరాడుతున్న‌ది. అయితే ప్ర‌చార ప‌టాటోపాలు, హ‌డావుడి, హంగామ‌, హంగూ ఆర్బాట‌మూ అంతా సైలెంట్‌గానే ఓట‌రు గ‌మ‌నిస్తున్నా.. మ‌దిలో మాత్రం ఎవ‌రికి ఓటేయాలో లెక్క‌లు వేసుకున్నాడు. త‌న అంచ‌నాల్లో త‌ను ఉన్నాడు. బీఆరెస్‌కు వేస్తే ఏం లాభం.. బీజేపీని గెలిపిస్తే ఏం ప్రయోజ‌నం..? అనే డిస్క‌ష‌న్ కూడా ఓట‌ర్ల అంత‌రంగాల్లో జ‌రుగుతున్న‌ది. అందుకే న‌లుగురి కూడిన చోట త‌మ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే మ‌స్తిష్కాల‌న్నీ ఒకే మాట చెబుత‌న్నాయి… అధికార పార్టీని గెలిపించి.. అభివృద్ధికి బాట‌లు వేసుకోవాల‌ని. మతం మ‌త్తు కిక్కెక్కి త‌ల‌కెక్కితే వ‌చ్చే లాభం ఏముంటుంది? అనే డిష్క‌ష‌న్ కూడా యువ‌కుల్లో ఉంది. అటు బీఆరెస్‌, ఇటు బీజేపీ .. ఈ రెండు పార్టీల‌ను గెలిపించ‌డం వ‌ల్ల తాము కోరుకున్న ప్ర‌గ‌తి సాధ్య‌మ‌వుతుందా? క‌ల‌లు గ‌న్న అభివృద్ధి క‌ళ్ల‌ముందు క‌నిపిస్తుందా? అనే ప్రశ్న‌ల‌కు స‌మాధానంగానే వారి ఓటు ఎవ‌రికో తేలిపోనున్న‌ది.

 

Dandugula Srinivas

Senior Journalist

7661066999