(దండుగుల శ్రీనివాస్)
నయాపైసా ఉపయోగం లేని బీజేపీని రాష్ట్రంలో బొంద పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 8 ఎంపీ సీట్లిస్తే.. ఇద్దరు కేంద్ర మంత్రులను చేసుకున్నారని, వారితో ఇంత వరకు నయాపైసా లాభం తెలంగాణకు చేకూరలేదన్నారు. తను అన్ని కులాలకు, మతాలకు అండగా ఉంటున్నానని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉండి వారి వారి ఆదరాభిమానాలు చూరగొంటున్నానన్నారు. అందుకే తను అందరివాడనయ్యానని పేర్కొన్నారు. గౌడ్‌లలో గౌడులా, ముదిరాజులలో ముదిరాజులా, మాదిగలో మాదిగలా, ముస్లింలలో ముస్లింలా కలిసి పోయి వారి జాతి తనను సొంత మనిషిలా అక్కున చేర్చుకోవడం ఎంతో ఆనందాన్నిస్తున్నదన్నారు.
కానీ కిషన్‌రెడ్డి మాత్రం కేసీఆర్‌కు దత్తపుత్రుడిలా వ్యవహరిస్తున్నారని సీఎం ఆరోపించారు. కేటీఆర్ దొంగ పుత్రుడైతే, కిషన్‌రెడ్డి దత్త పుత్రుడని.. అందుకే కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు పోకుండా ఈయనే కాపాడుతున్నాడని ధ్వజమెత్తారు. నిజామాబాద్‌లో అర్వింద్‌ను గెలిపిస్తే ఇప్పటి వరకు నయాపైసా కూడా మోదీ దగ్గర నుంచి తీసుకురాలేదని, అతనో చెల్లని రూపాయి అని విమర్శించారు. అందుకే బీజేపీ మాటలను వినొద్దని, బీజేపీ, బీఆరెస్ పార్టీలకు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్టేనని ఓటర్లకు ఆయన సూచించారు. ఇన్నేండ్లలో నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీ చేయలేకపోయిన అర్వింద్.. ఇప్పటి వరకు చెప్పినవన్నీ కల్లబొల్లి మాటలేనని, అతనితో ఏం కాదని తీసిపారేశారాయన. నిజామాబాద్ కార్పొరేషన్ కేంద్రంగా అభివృద్ది చేసి.. తెలంగాణకే ఆదర్శనంగా నిలిపేలా తను కృషి చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. జిల్లాకు ఎయిర్ పోర్టు తీసుకొస్తానన్నారు. ఔటర్ రింగు రోడ్డు నిర్మిస్తానని తెలిపారు.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
