(దండుగుల శ్రీనివాస్)
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. మహేశ్ కుమార్ గౌడ్ రచ్చ గెలిచాడు. పీసీసీ చీఫ్ స్థాయికి ఎదిగాడు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని, ప్రజలను ప్రభావం చేసే గొప్ప లీడర్‌గా ఎదిగి ఒదిగాడు. కానీ ఇప్పుడు ఇంట గెలవాల్సిన తరుణం ఆసన్నమైంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో గెలిచి చూపాలి. ఇక్కడ కార్పొరేషన్‌ను హస్తగతం చేసుకోవాలి. అప్పుడే తన పరపతి మరింత ఇనుమడిస్తుంది. కానీ ఇక్కడన్నీ ఆయనకు ప్రతికూల పరిస్థితులే. ఎంఐఎం మీద భారీ ఆశలు పెట్టుకున్నా… ఇంకా ఏదో వెలితి. ఏదో భయం ఆపార్టీని వెంటాడుతోంది. మేయర్ స్థానానికి కావాల్సిన మ్యాజిక్ సీట్లు వస్తాయా? ఎక్స్ అఫిషియో మెంబర్లను వాడుకున్నా.. మేయర్‌ను డ్యామ్‌షూర్‌గా గెలవగలుగుతామా అనేది ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.
ఇక్కడ బీజేపీ బలంగా ఉండటం, బీఆరెస్ మొత్తం డీలా పడటం కూడా కాంగ్రెస్ కష్టకాలాన్ని తెచ్చిపెట్టింది. అంతే కాదు… ఇక్కడ నేతలంతా పెద్దపెద్దోళ్లున్నా.. ఎవరికి వారే యమునా తీరే. అంతా పెద్దరికం చేసేవాళ్లే. పేరుకు జిల్లాకు పెద్దగా ఉన్న సుదర్శన్‌రెడ్డి ఆయన నియోజకవర్గం బోధన్‌లోనే పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఇక నిజామాబాద్‌ను ఏం పట్టించుకుంటాడనే పెదవి విరుపు కనిపిస్తున్నది. నిజామాబాద్ అర్బన్ ఇంచార్జిగా ఉన్న షబ్బీర్ అలీ.. కూడా పెద్దగా ఇక్కడ ప్రభావం చూపలేడు. ఎందుకంటే ఆయన ఇక్కడ దత్త పుత్రుడు. పూర్తిగా ఆయన కామారెడ్డి మీదే కాన్సన్ ట్రేట్ చేశాడు. ఇక జిల్లా లీడర్లు అని చెప్పుకునే నేతలు గల్లీల్లో కూడా ప్రభావం చూపలేకపోతున్నారు.
దీంతో మహేశ్ అంతా తానై నడిపిస్తున్నాడు. కష్టపడుతున్నాడు. ఉన్న దరిద్రాలు చాలవని.. మేయర్ అభ్యర్థిగా ఎంచుకున్న నరేందర్‌రెడ్డి ఆస్తిపన్ను ఏకకాలంలో 8 కోట్లు కట్టించుకోవడం పార్టీకి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. దీన్ని బీజేపీ వాడుకుంటోంది. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఈ ఒక్క అంశాన్ని జనాల్లోకి తీసుకుపోయి పార్టీకి పెద్ద ఎత్తున లబ్ది చూకూరేలా ఎత్తులు వేశాడు. సోషల్ మీడియాలో ఇదే వార్తను రీల్స్ రూపంలో గిర్రు గిర్రుమని తింపుతున్నారు. ఇన్ని ప్రతికూల అంశాల మధ్య మహేశ్ సింగిల్‌గా పోరాడుతున్నాడు. సీఎం రేవంత్ కూడా నిజామాబాద్ కార్పొరేషన్ భారం ఆయన మీదే వేశాడు. దీంతో ఇదిప్పుడు గౌడుకు ఇజ్జత్ కా సవాల్ అయి కూర్చుంది.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
