(దండుగుల శ్రీ‌నివాస్‌)

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేసి దివాళ తీపిచ్చిండ‌ని, తాను మాత్రం ఫామ్‌హౌజ్‌లో పండుకుని నెల నెలా జీతం తీసుకుంటున్నాడ‌ని సీఎం రేవంత్‌రెడ్డి విమ‌ర్శించారు. క‌రీంన‌గ‌ర్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. రాష్ట్రం చేతికిచ్చిన‌ప్పుడు 70వేల కోట్ల అప్పు మాత్ర‌మే ఉండెన‌ని, ప‌దేళ్ల‌లో 8ల‌క్ష‌ల కోట్ల‌కు అప్పును పెంచి తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాల‌ను అల్ల‌క‌ల్లోలం చేశాడ‌ని కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు సీఎం రేవంత్‌.
కేసీఆర్ చేసిన అప్పుల‌కు నెల‌కు ఆరు వేల కోట్లు మిత్తీ క‌ట్టేందుకే పోతుంద‌ని, ఇప్పుడిప్పుడే స‌ర్కార్‌ను గాడిలో పెడుతున్నామ‌ని అన్నారు.

అసెంబ్లీకి రావ‌య్యా అంటే రాడు… కానీ టంచ‌నుగా జీతం తీసుకుంటాడు. వ‌స్తే గిస్తే కాంగ్రెస్ స‌ర్కార్‌ను శ‌పిస్తాడు… శాప‌నార్ధాలు పెడ‌తాడు. ఇది తెలంగాణ స‌మాజానికి మంచిదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. పిల్లి శాపాల‌కు ఉట్టి ఊడిప‌డ‌ద‌ని, కేసీఆర్‌, కేటీఆర్ ఎన్ని శాపాలు పెట్టినా ఇంకా 8 ఏండ్లు కాంగ్రెస్ పాల‌నే ఉంటుంద‌న్నారు సీఎం. దేశం, ప్ర‌పంచ‌మే స‌మ్మ‌క్క‌, సారాల‌మ్మ‌ను దర్శించుకుంటే కేసీఆర్, కేటీఆర్‌, హ‌రీశ్‌లు మాత్రం రాలేద‌ని, వీరికి పేద దేవుళ్లంటే చిన్నిచూపున్నారు. అందుకే రానున్న గోదావ‌రి పుష్క‌రాల‌లో బాస‌ర నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కు ఉన్న దేవాల‌యాల‌న్నీ అభివృధ్ది చేసి పుణ్య‌క్షేత్రాలుగా తీర్చి దిద్దుతామ‌ని, ప‌ర్యాట‌క ప్రాంతాలుగా చేస్తామ‌న్నారు.

స‌మైక్య రాష్ట్రంలో క‌ట్టిన ఇందిర‌మ్మ ఇళ్లే త‌ప్ప‌.. ప‌దేండ్ల‌లో ఎన్ని డ‌బుల్ బెడ్ రూంలు కేసీఆర్ క‌ట్టించాడ‌ని సీఎం నిల‌దీశారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో డిపాజిట్లు కోల్పోయిన బీఆరెస్ పార్టీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఎట్ల గెలుస్త‌ర‌ని అన్నారు. బీజేపీ, బీఆరెస్‌ది ఫెవికాల్ బంధ‌మ‌ని, వీరికి చీక‌టి ఒప్పందం ఉంద‌ని ఆరోపించారు సీఎం. కాళేశ్వ‌రం అవినీతిని బ‌య‌ట‌పెట్టి సీబీఐ విచార‌ణ‌కు శాస‌న స‌భ‌లో తీర్మానం చేసి పంపితే.. ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీశ్‌ల‌ను ఎందుకు అరెస్టు చేయ‌లేద‌ని సీఎం ప్ర‌శ్నించారు. బీఆరెస్ ద‌గ్గ‌ర బీజేపీ మామూళ్లు వ‌సూలు చేసుకుంటుంద‌ని ఆరోపించారు.

Dandugula Srinivas

Senior Journalist

7661066999