వాస్తవం ప్రతినిధి – మెదక్:
తెలంగాణ కోసం ప్రజలు తమ వంతు పాత్ర పోషించి, త్యాగాలు చేసి ఉద్యమం చేశారని , బీఆర్‌ఎస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్నాయని ఉపాధి–కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు దండుకుని, సొంతంగా, పార్టీ ఆస్తులను పెంచుకున్నారని విమర్శించారు. మెదక్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో మెదక్ లోక్ సభ నియోజకవర్గం ఇంచార్జి, మంత్రి వివేక్ వెంకటస్వామి సమావేశమయ్యారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు. కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు ఆకాశమంత ఎత్తుకు పెరిగాయని, బీఆర్‌ఎస్ పార్టీకి రూ.800 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. మేఘా కృష్ణా రెడ్డి రూ.400 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చారని పేర్కొన్నారు.
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకపోయినా, అప్పటి సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని విమర్శించారు. కవిత చేస్తున్న ఆరోపణలను ఎవరూ ఖండించకపోవడం అవన్నీ నిజాలేనని స్పష్టం చేస్తోందని అన్నారు.
ధనిక రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిందని, ఆదాయం కేవలం రూ.లక్ష కోట్ల వరకు మాత్రమే ఉండటంతో వడ్డీలకే సరిపోవడం లేదని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మెల్లమెల్లగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుతోందని చెప్పారు.
మహిళల కోసం ఉచిత బస్ పథకాన్ని అమలు చేస్తున్నామని, ఇప్పటివరకు ఈ పథకానికి రూ.9 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. దీనివల్ల మహిళలు నెలకు సుమారు రూ.3 వేల వరకు ఆదా చేసుకుంటున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఒక్కరికీ రేషన్ కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తోందని తెలిపారు. అలాగే అర్హులైన వారికి పెన్షన్లు కూడా మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీకి రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, మహిళ శక్తి కార్యక్రమం కింద మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.23 వేల కోట్లు మంజూరు చేశామని చెప్పారు. వడ్డీ లేని రుణాలు కూడా చెల్లించామని తెలిపారు. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే నెలకు రూ.2,500 ఇచ్చే పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.మున్సిపల్ ఎన్నికలపై ముఖ్యమంత్రి సెగ్మెంట్ వారీగా సమీక్ష నిర్వహించారని, రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం కౌన్సిలర్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, మెదక్‌లో 90 శాతం వరకు గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మెదక్ మున్సిపాలిటీలో మొత్తం 29 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోనున్నట్లు విశ్వాసం వ్యక్తం చేశారు.
అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని, ఓవర్ కాన్ఫిడెన్స్‌కు పోవద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మరో మూడు సంవత్సరాలు అధికారంలో ఉంటుందని, అభివృద్ధి పనులు జరగాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. సమయం చాలా తక్కువగా ఉన్నందున ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేయాలని సూచించారు. ప్రజలను కలుసుకుని ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించాలని అన్నారుమైనంపల్లి హన్మంతరావు ఉన్న కారణంగా హరీశ్ రావు మెదక్‌పై ఎక్కువ దృష్టి పెడతారని, కానీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మెదక్, దుబ్బాక నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. రెండు లైన్ రోడ్లను నాలుగు లైన్లుగా చేసుకుని, మేఘా ప్రాజెక్టులను తరలించారని, మెదక్ నుంచి కార్యాలయాలను కూడా తరలించారని ఆరోపించారు. హరీశ్ రావును రాజకీయంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
