(దండుగుల శ్రీనివాస్)
తనను ఓడించింది సొంత గూటి వాళ్లే. అంటే .. ఇందూరు బీఆరెస్ ఎమ్మెల్యేలు. ఎవరు వాళ్లు..? అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న బిగాల గణేశ్ గుప్తా, బోధన్ ఎమ్మెల్యే షకీల్, బాల్కొండ ఎమ్మెల్యే, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్… వీళ్లే కదా. అవును .. ఆమె ఉద్దేశ్యం కచ్చితంగా వీళ్లే. ఇప్పుడు వీరిలో ఓ వణుకు పుట్టింది. ఏమని..? కవిత మమ్మల్ని బతకిస్తుందా? అని. మళ్లీ మాకు టికెట్లు ఇస్తారో… ఇయ్యరో అని టెన్షన్ ఒకటి వెంటాడుతుండగా.. ఇప్పుడు కవిత రూపంలో మరో ఉపద్రవం ముంచుకొచ్చి పడింది ఇందూరు గులాబీ శిబిరంలో.
రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వీరే కష్టపడాలి. ఖర్చు పెట్టాలి. అధినేత వద్ద తన పరపతి చాటుకోవాలి. లేదంటే మళ్లీ టికెట్లు కష్టమే. ఎందుకంటే… ఈ సిట్టింగులకు ఇచ్చినవాళ్లకే ఇచ్చి ఇచ్చే అధికారం పోగొట్టుకున్నాడనే వాదన ఉండనే ఉంది. మరి ఇది పోగొట్టుకునేందుకు కష్టపడాలి. ఖర్చు పెట్టాలి. పదేండ్లూ సంపాదించుకున్నారు కదా. కానీ ఈ కవితేందీ? ఇప్పుడు కొత్త కష్టం తెచ్చి పెట్టింది. తమపై పగ బట్టింది. కచ్చితంగా తమను ఓడగొట్టే తీరుతుంది. తమ ఉనికి లేకుండానే చేస్తుంది. తమకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేసేందుకే కంకణం కట్టుకుని కూర్చుంది. మరెట్లా? ఖర్చు పెట్టాలా? కష్టపడాలా? చేసినా అంతా బూడిదలో పోసిన పన్నీరేనా? ఏం చేద్దాం..? బుగులు పట్టుకుంది పాపం ఇందూరు గులాబీ దండులో.

Dandugula Srinivas
senior journalist
766106677999
