(దండుగుల శ్రీనివాస్)
హైడ్రా ఏర్పాటు తరువాత ఎన్నో అపవాదులు. మరెన్నో అవమానాలు. ఎంతో అపకీర్తి అంటగట్టె ప్రయత్నాలు. శాపానార్దాలు.. దుమ్మెత్తిపోయడాలు. ఇవన్నీ చూశాం. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చడంతో ఆరంభమైన హైడ్రా దూకుడు అక్రమార్కులను కలవరపెట్టింది. ఇదే క్రమంలో దూసుకుపోతున్న హైడ్రాను నిలువరించేందుకు అక్రమార్కులు దీనికి మరకంటించారు. కాలక్రమంలో హైడ్రా చేస్తున్న చర్యలేమిటి? అది భవిష్యత్ తరాలకు , పేద వర్గాలకు ఎలాంటి మేలు చేస్తుందనే విషయంలో మెల్లగా జనంలో క్లారిటీ రావడం స్టార్టయ్యింది. అది బతుకమ్మ కుంటకు ప్రాణం పోసి పునరుజ్జీవం అందించడంతో పరిపూర్ణమైంది. ఒక్క బతుకమ్మ కుంట.. హైడ్రా నెత్తిన వేల అక్షింతలను వేసింది. దీవించింది. ఆశీర్వదించింది. రాజకీయాలకు అతీతంగా, పేద, పెద్దలని కాదు అంతా ఈ చర్యను కీర్తించారు. ఏ నోటా విన్నా ఇదే మాట. అబ్బ.. బతుకమ్మ కుంట ఎంత బాగైంది..! ఇది రేవంత్ రెడ్డి పుణ్యమే.
ఎప్పటికీ ఇది గుర్తిండిపోతుంది జనాలకు అని. అవును ఇది చరిత్రే. కాలగర్భంలో కలిసిపోయేందుకు సిద్దమై, అన్యాక్రాంత కోరల్లో రూపు రేఖలు కోల్పయి ఉన్న బతుకమ్మ కుంటకు జీవం పోసింది హైడ్రా. ఓ కొత్త రూపు నిచ్చింది. పాతరూపును జ్ఞప్తికి తెచ్చింది. ఇదంత సులువు కాలేదు. దీనికీ ఎన్నో ఆటంకాలు. అవన్నీ జయించారు.. హైడ్రా కమిషన్ రంగనాథ్. అవును.. సీఎంతో పాటు ఆయనా ఇప్పుడు హీరో. ఒకప్పుడు వీరిద్దరిపై ఓ మరక వేశారు. తిట్టించారు. శాపాలు పెట్టారు. అవే నోళ్లు ఇప్పుడు వీళ్లను కీర్తిస్తున్నాయి. పొడుగుతున్నాయి. ఇలాంటికి ఇంకా ఎన్నో ఎన్నో చేపట్టాలని ఆంకాక్షిస్తున్నాయి.
చేసే పని సరైందయినప్పుడు.. దాని లక్ష్యం పవిత్రమైనదైనప్పుడు కొంత సమయం పట్టొచ్చు గాక. తిట్లు పడుతుండొచ్చు గాక. వ్యతిరేతక వచ్చిపడుతుండొచ్చు గాక. కానీ అంతిమంగా కాలం పరిష్కారం చూపుతుంది. దాని విలువ తెలయజేస్తుంది. దాని ఫలాలు ఆనందాన్నిస్తాయి. అప్పుడుగానీ అర్థం కాదు దానికున్న సంకల్పబలం. హైడ్రా విషయంలో అదే జరిగింది. ఇకపై ఇది మరింత ఉత్సాహంతో జనామోదంతో.. సంఘం మద్దతుతో దూకుడుగా ముందుకు పోనుంది. సిటీ బంగారు భవిష్యత్తు నిర్మాణంలో కీలక భూమిక పోషించనుంది.
Dandugula Srinivas
Senior Journalist
7661066999