వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్:
గత ప్రభుత్వ తప్పిదాలను ఏమాత్రం వదలకుండా వెంటాడుతోంది సర్కార్. పాత డిజైన్లు, అప్పటి ప్రభుత్వ ఉద్దేశ్యాలను తప్పుగా భావించిన సర్కార్.. తమదైన పంథాలో కొత్త తరహా ప్రాజెక్టుల నిర్మాణాలకు పూనుకుంటున్నది. ఇందులో భాగంగా బుధవారం సంచలన నిర్ణయం తీసుకున్నది. కేశవాపురం రిజార్వాయర్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. రూ. 2 కోట్ల మేర ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును మెగా ఇంజినీరింగ్ కంపెనీ చేపడుతోంది. దీన్ని రద్దు చేయడంతో మెగా కంపెనీకి షాక్ తగిలింది. ఇప్పుడిది రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
గోదావరి ఫేజ్ 2లో భాగంగా హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ పనులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. గోదావరి జలాలను కొండపోచమ్మసాగర్ నుంచి కేశవాపురం రిజర్వాయర్ కు.. అక్కడి నుంచి హైదరాబాద్ కు తాగునీటి అవసరాల పేరిట గత ప్రభుత్వం డిజైన్ చేసిన ఈ డొంక తిరుగుడు పనులను విరమించుకుంది.
■ మెఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చిన ఈ కాంట్రాక్టును రద్దు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్మెంట్ ఇంజనీరింగ్ విభాగం జీవో జారీ చేసింది.
■ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కేశవపురం రిజర్వాయర్, అందులో భాగంగా చేపట్టే పనులకు అయ్యే దాదాపు రూ.2 వేల కోట్ల ఖర్చు ఆదా కానుంది.
■ అదే ఖర్చుతో.. గోదావరి ఫేజ్ 2 స్కీమ్ ను మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల వరకు పొడిగించి, హైదరాబాద్ గ్రేటర్ సిటీ తాగునీటి అవసరాలకు తాగునీటిని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
■ హైదరాబాద్ కు 10 టీఎంసీల తాగు నీటిని సరఫరా చేయటంతో పాటు జంట జలాశయాలకు 5 టీఎంసీల నీటిని అందించేలా మల్లన్నసాగర్ నుంచి బహుళ ప్రయోజనాలుండేలా 15 టీఎంసీల నీటిని పంపింగ్ చేసే ప్రాజెక్టు చేపట్టాలని ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
■ త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలవాలని హైదరాబాద్ వాటర్ బోర్డ్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
■ పాత టెండర్ల ప్రకారం ఎల్లంపల్లి నుంచి వచ్చే గోదావరి నీళ్లను మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్, అక్కడి నుంచి లిఫ్ట్ చేసి కేశవపురం చెర్వు నింపుతారు. కేశవపురం చెర్వును 5 టీఎంసీల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్ గా నిర్మిస్తారు. అక్కడి నుంచి ఘన్పూర్ మీదుగా హైదరాబాద్ కు 10 టీఎంసీల తాగునీటి అవసరాలకు సరఫరా చేయాల్సి ఉంది.
■ ఆరేండ్లయినా ఈ పనులు ప్రారంభం కాలేదు. భూసేకరణ చిక్కులతో పాటు అనాలోచితమైన అలైన్మెంట్ కారణంగా పనులు ముందుకు సాగలేదు. గత ప్రభుత్వం అటవీ భూములు, రక్షణ శాఖ భూముల నుంచి ప్రాజెక్టును డిజైన్ చేయటం, ఎంచుకున్న పైపులైన్ రూట్ సరిగ్గా లేకపోవటంతో పనులు ముందుకు సాగలేదు. పనులు ఆగిపోయాయి.
■ గత ప్రభుత్వం హయంలో ఈ టెండర్లను దక్కించుకున్న మెఘా కంపెనీ ఈ పనులు చేపట్టకుండా వదిలేసింది.
2017 నాటి ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం పనులు చేపట్టలేమని, 2024 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం అంచనాలను సవరించాలని మెఘా కంపెనీ ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాసింది.
■ రేట్ల పెంపును తిరస్కరించటంతో పాటు ఇప్పటివరకు పనులు చేపట్టని కారణంగా మెఘా కంపెనీకి కేటాయించిన టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
■ తక్కువ ఖర్చుతో గ్రేటర్ సిటీకి తాగునీటి సరఫరాతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నీటిని నింపేందుకు ఎక్కువ భాగం గ్రావిటీతో వచ్చేలా కొత్త అలైన్మెంట్ ప్రకారం పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
■ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో గోదావరి నీటిని హైదరాబాద్ కు తరలించేందుకు ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు తొలిగిపోనున్నాయి.
■ కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి అయ్యే ఖర్చు తగ్గిపోతుంది. అక్కడ ఆదా అయ్యే ఖర్చుతో ఇంతకాలం నిర్యక్షానికి గురైన ఉస్మాన్ సాగర్ , హిమాయత్సాగర్ రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తాయి.
■ కొత్త రూట్ ప్రకారం.. కొండపోచమ్మసాగర్, కేశవపురం జోలికి వెళ్లకుండా.. అటువైపు దారి మళ్లించకుండా.. నేరుగా మల్లన్నసాగర్ నుంచి ఘన్పుర్.. అక్కడి నుంచి హైదరాబాద్ తాగునీటికి 10 టీఎంసీలు, జంట జలాశయాలకు మరో 5 టీఎంసీలు పంపింగ్ చేస్తారు.
■ 15 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న కొండపోచమ్మసాగర్ తో పోలిస్తే 50 టీఎంసీల కెపాసిటీ ఉండే మల్లన్నసాగర్ లో నీటి లభ్యత ఎక్కువ. స్లూయిస్ లెవెల్ ప్రకారం.. కొండపోచమ్మ సాగర్ లో 8 టీఎంసీల నీళ్లుంటే తప్ప నీటిని పంపింగ్ చేయటం కుదరదు. అదే మల్లన్నసాగర్ లో డెడ్ స్టోరేజీ నుంచి కూడా నీటిని పంప్ చేసుకునే వీలుంటుంది.