కౌన్సిలర్‌గా గెలవలేని నాన్‌లోకల్‌

ఎమ్మెల్యే కోసం అర్రులు..

మోనార్క్‌ వెంకట రమణారెడ్డిపై సొంత పార్టీలోనే కుంపట్లు..

బీసీలను విస్మరించి.. నాన్‌లోకల్‌ను తెచ్చిపెట్టి….

ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలా చూస్తారు..? మేము లేమా..? బీజేపీ కామారెడ్డి బీసీ నేతల అంతర్యుద్దం..

వాస్తవం, కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి బీజేపీలో ముసలం రేగింది. అది ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా లేదు. తనకు తను మోనార్క్‌గా చాటుకుంటు ఒంటెత్తు పోకడలు పోయే కాట్‌పల్లి వెంకట రమణా రెడ్డిపై ఇప్పటికే సొంత పార్టీలో కుంపటి రాజుకుంది. ఎవరినీ కలుపుకుపోకుండా అంతా తానై వ్యవహరించే కాట్‌పల్లి వైఖరి పై వాస్తవం వెబ్‌సైట్‌లో మోనార్క్‌ పేరుతో వచ్చిన కథనం సంచలనం రేపింది. వైరల్‌గా మారింది. కామారెడ్డి ఎమ్మెల్యేగా తనను తాను ఊహించే వెంకట రమణపై వచ్చిన,వస్తున్న వ్యతిరేకత అంతా ఇంతా కాదు.

వాస్తవంగా ఇతనిది కామారెడ్డి కాదు. ఇక్కడ నాన్‌ లోకల్‌. తాడ్వాయి మండలం దేమీకలాన్‌కు చెందిన వాడు. అక్కడి నుంచే గతంలో జడ్పీటీసీగా పోటీ చేశాడు. ఆ తర్వాత కామారెడ్డి మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా పోటీ చేసినా నాన్‌ లోకల్‌ అయినందున ఓటర్లు తిప్పికొట్టారు. ఓడించారు. కానీ ఇప్పుడు ఏకంగా బీజేపీ కామారెడ్డి అభ్యర్థిని తానే నంటూ ప్రచారం చేసుకుంటూ .. కాబోయే ఎమ్మెల్యేగా ఊహించుకుని సొంత పార్టీలో తన దుందుడుకు వైఖరి చూపుతూ మరింత వ్యతిరేకత పెంచుకున్నాడు.

పార్టీ పుట్టిన నాటి నుంచి ఆ పార్టీనే నమ్ముకుని ఉన్న నేతలను కాదని, బీసీలను విస్మరించి అంతా రెడ్డి రాజకీయం చేసే వెంకట రమణ అంటే భగ్గుమంటున్నారు. కామారెడ్డి బీజేపీలో ఇప్పుడు అంతర్యుద్దం మొదలైంది. అంతా రెడ్లను తీసుకొచ్చి పెట్టుకుని తమను విస్మరిస్తున్నారని బీజేపీ కామారెడ్డి బీసీ నేతలు గుర్రుగా ఉన్నారు. అసలే నాన్‌ లోకల్ క్యాండిడేట్‌. ఆపై రెడ్డి రాజకీయం.. దీంతో ఇతడు మాకొద్దంటే మాకొద్దంటూ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారట.

ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా కామారెడ్డిలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీజేపీకి వెంకట రమణారెడ్డి వ్యక్తిత్వం, నాన్‌లోకల్, రెడ్డి రాజకీయం .. ప్రజల నుంచి దూరం చేస్తుందనే భావనలో ఉన్నారంతా. అదే జరుగుతుందక్కడ.