ఆయనంతే. ఆది నుంచి ఆయన వ్యక్తిత్వం..వైఖరి డిఫరెంట్‌. మోనార్క్‌ టైపు. తన అవకాశాల కోసం… అవసరాల కోసం… నచ్చినట్టు చేస్తాడు. సొంత లాభం కోసం ఏ నిర్ణయాలైనా తీసుకుంటారు. రాజకీయాల్లో తనకంటూ ఓ వివాదస్పద ముద్ర వేసుకుని దాన్నే కంటిన్యూ చేస్తూ కంటగింపుగా మారాడు. ఆయనే కాట్‌పల్లి రమణారెడ్డి. ప్రస్తుతం బీజేపీ కామారెడ్డి టికెట్‌ ఆశిస్తూ ఆశల పల్లికిలో ఊరేగుతున్నాడు. వాస్తవంగా అక్కడ మొన్న జరిగిన పరిణామాలు బీజేపీకి కొంత ఊపు తెచ్చిపెట్టాయి. కానీ రమణారెడ్డి వైఖరితో అది కాస్తా బలుపు కాదు.. వాపేనని తేలిపోతున్నది. పార్టీ సిద్దాంతాలు పట్టవు. పార్టీ ఆదేశాలు తనవద్ద చెల్లవు. సీనియర్లను కలుపుకుపోడు. తనకు నచ్చింది చేస్తాడు.

రెడ్డి అని వెనుక తోక ఉంటే చాలు వారికి పదవులు. మిగితా వారిని దరికి కూడా రానీయని తత్వం. పార్టీ జిల్లా అధ్యక్షురాలు మినహా అంతా రెడ్లే. ఇదీ అక్కడ పరిస్థితి. కాట్‌పల్లి కాలుదువ్వే మనస్తత్వంతో పార్టీ కామారెడ్డిలో బీజేపీ పరిస్థితి ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. సీనియర్లు గుర్రుగా ఉన్నారు. తను ఇప్పుడే ఎమ్మెల్యే అయిపోయినట్టు బిల్డప్‌ ఇస్తున్నాడంటూ ఆ పార్టీ నేతలే సదరు నేతపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఏ కార్యక్రమాలు చేసినా పార్టీ గొడుగు కింద కాదు.. తన సొంత ఎజెండాగా నడవాలే. తనకే పేరు రావాలె. అందుకే పార్టీ పెద్దలకు ఈ నేతంటే పట్టదు. పట్టించుకోరు. పార్టీని బలోపేతం చేయకుండా తన వ్యక్తిగత ఇమేజ్‌కే ప్రయార్టీ ఇచ్చే నేత ఎప్పుడు ఎక్కడికి జంప్‌ అవుతాడో తెలియదనే వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆయన రాజకీయ గత చరిత్ర తెలిసినవారంతా ఇలాగే చర్చించుకుంటున్నారు.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కాస్తో కూస్తో కామారెడ్డిలో బీజేపీ నయం అనే అభిప్రాయం ఉండేది. అది కూడా ఇప్పుడు లేకుండా చేసేశాడు కాట్‌పల్లి. ఇప్పుడక్కడ గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఏదో ఒక కార్యక్రమంతో ప్రజలను రెచ్చగొట్టి.. మీడియాలో హల్‌ చల్‌ చేసి తన పేరు తెరమీద కొంతకాలాం వెలిగేలా చూసుకుంటాడు. ఆ తర్వాత సైలెంట్‌గా జారుకుని అజ్ఞాతవాసం చేస్తాడంటూ ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. కామారెడ్డి పట్టణంలో కొంత బీజేపీ బలపడింది. యువత పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. రమణారెడ్డి వైఖరితో యూత్‌ కూడా చాలా మంది ఇతర పార్టీలకు డైవర్ట్‌ అవుతున్నారు. ఇక టౌన్‌లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే… ఈ నియోజకవర్గంలోని 99 గ్రామాల్లో ఆ పార్టీకి ఏమాత్రం పట్టులేదు. అంతా పైపై మెరుగులే. మొరుగుడే.

You missed