(దండుగుల శ్రీనివాస్)
మంచి క్వాలిటీ చీరలు. ఒక్కో చీరకు రూ. 800. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తరువాత గత సర్కార్ చేసిన పొరపాటు చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నది. కానీ అన్నీ చేసి ఒక్కదగ్గరే పోగొట్టుకున్నది. ఈసారి బతుకమ్మ చీరలను కేవలం మహిళా సంఘాల సభ్యులకే ఇద్దామని డిసైడ్ అయ్యింది సర్కార్. అదీ ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున. ఇక్కడే అసలు కయ్యం ముదిరింది. మహిళా సంఘాల్లో లేని మహిళలు గయ్యుమని లేచారు సర్కార్ మీద. మేం మేం పాపం చేశాం..? మాకెందుకియ్యరు..?? అనే దగ్గర నుంచి మొదలైన కోపం.. మేం ఓట్లేస్తే గెలవలేదా? వాళ్లు మాత్రమే ఓట్లేస్తే గెలిచిందా సర్కార్..?? అనే దాకా వచ్చింది కత. అసలు స్టాకు సరిపడా రాలేదు.
ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. మరోవైపు ఈ లొల్లి. దీంతో సర్కార్ కూడా దీనిని పెండింగ్‌లో పెట్టింది. దసరా తరువాతే బతుకమ్మ చీరలు ఇద్దామనుకున్నది. అందరికీ ఇస్తేనే తప్ప ఈ వివాదం నుంచి సర్కార్ బయటపడేలా లేదు. మహిళా గ్రూపుల్లో మొత్తం 69 లక్షల మంది వరకు మహిళలున్నారు. వీరికి రెండేసి చీరల చొప్పున ఇచ్చే బదులు… రేషన్‌కార్డుల్లో ఉన్న మహిళలంతా కలిపి ఒక కోటి వరకు ఉంటారు .వీరిందరికీ తలా ఒక చీర ఇస్తే సంతోషిస్తారనేది పబ్లిక్ టాక్‌గా ఉంది. దీని ద్వారా ఎవరికీ కోపం రాదు.. అందరికీ నాణ్యమైన చీరలు అందుతాయనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
గతంలో కేసీఆర్ సర్కార్ రేషన్‌కార్డులో ఉన్న 18 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు బతుకమ్మ చీరను అందించారు. కానీ అవి నాసిరకంగా ఉండటంతో చాలా మంది మహిళలు వాటిని రోడ్లపై వేసి తగులబెట్టడం వివాదమైంది. సర్కార్‌కు అప్పుడు మచ్చను తెచ్చిపెట్టింది. ఆ మచ్చ పడకుండా కాంగ్రెస్ సర్కార్ బాగానే ప్లాన్ చేసినా.. తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. దీంతో తప్పుదిద్దుకునే పనిలో పడింది. అందుకే చీరల పంపిణీ ఆలస్యమైంది. దసరా తరువాతే అందరికీ ఇద్దామనే ఆలోచనలో సర్కార్ ఉంది.
Dandugula Srinivas
7661066999